అలరించే రూల్స్ రంజన్- రివ్యూ

శుక్రవారం, 6 అక్టోబరు 2023 (16:03 IST)
Kiran Abbavaram, Neha Shetty,
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన  మూవీ 'రూల్స్ రంజన్'. సుప్రసిద్ధ నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు రత్నం కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మురళీ కృష్ణ వేమూరి, దివ్యాంగ్ లావానియా నిర్మించారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోగా కిరణ్‌ అబ్బవరం సినిమాల్లో ఇప్పటికే ఆయన్ను గుర్తుపెట్టుకొనేలా చేసేది ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం. ఆ తర్వాత దేనికదే వైవిధ్యమైన సినిమాలు చేశాడు. ఇప్పుడు రూల్స్‌ రంజన్‌ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు ఈరోజు వచ్చారు. మరి ఆ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
విశాఖపట్నంలో ఓ మోస్తర్‌ స్టూడెంట్‌ రంజన్‌ (కిరణ్‌ అబ్బవరం). కాలేజీ పూర్తయ్యాక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంకోసం అప్లయి చేస్తే ముంబై కంపెనీలో అవకాశం వస్తుంది. భాష రాకపోయినా ఏదో మేనేజ్‌ చేస్తూంటాడు. అక్కడ రంజన్‌ను వెదవలా ట్రీట్‌ చేస్తూ తాముచేయాల్సిన పనిని అతనిచేత పూర్తిచేయిస్తాడు సహ ఉద్యోగి. అది గ్రహించిన రంజన్‌ ఓ ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌లేటర్‌ మిషన్‌ కొని దానిద్వారా ఆఫీసు స్టాఫ్‌ మాట్లాడిన మాటలను ఇంటికెళ్ళి విని దాని ద్వారా కొన్ని సమస్యలు సాల్వ్‌ చేస్తాడు. దాంతో కంపెనీ మేనేజర్‌ రంజన్‌ను ప్రమోట్‌ చేస్తాడు. ఆ తర్వాత ఆఫీసులో తను కొన్ని రూల్స్‌పెట్టి పాటిస్తుంటాడు. అలా అందరినీ తన కంట్రోల్‌ పెట్టుకున్న రంజన్‌ తన ఎదురింటి ప్లాల్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (వెన్నెలకిశోర్‌)నూ అతడి చేష్టలతో వెల్లగొడతాడు.  కాగా, ఓ రోజు  తన క్లాస్‌మేట్‌ నేహాశెట్టి ఉద్యోగం పనిమీద ముంబైకు వస్తుంది. ఆమె రాకతో రంజన్‌ జీవితంలో పెనుమార్పులు సంభవిస్తాయి. దాంతో అమ్మాయిలంటే ఆమడదూరంలో వుండే రూల్స్‌ రంజన్‌ తన రూల్స్‌ను ఎలా మార్చుకున్నాడు. తన క్లాస్‌మేట్‌ ప్రేమను దక్కించుకున్నా? లేదా? అనేది మిగిలిన కథ.
 
సమీక్ష:
ఈ చిత్రకథాంశం సరదాగా వుంటుంది. కుటుంబసమేతంగా చూడతగ్గ సినిమా. కాలేజీలో చదివే టైంనుంచి జాబ్‌ చేసేవరకు రంజన్‌ జర్నీ ఈ సినిమా. ఇందులో వచ్చే ప్రతిపాత్రా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ముంబైలోని తన స్టాఫ్‌ను కంట్రోల్‌ చేసేవిధానం, రంజన్‌ రూల్స్‌ మార్చుకోవడం వంటి సన్నివేశాలు చాలా ఫన్‌ క్రియేట్‌ చేస్తాయి. ఇక విశాఖపట్నంలో తన క్లాస్‌మేట్స్‌ సత్య, హైపర్‌ ఆది, వైవాహర్షను కలవడం నుంచి సినిమా ముగింపు వరకు ఫుల్‌ వినోదమే.  తను ప్రేమించిన సన (నేహాశెట్టి) కోసం రూల్స్‌ రంజన్‌ పడే పాట్లు, మధ్యలో ఆమె సోదరుడు సుబ్బరాజు, మరో నటుడు అజయ్‌ల ఎపిసోడ్‌ చాలా సరదాగా సాగుతుంది.
 
ఇందులో కిరణ్‌ అబ్బవరం నటన అలరిస్తుంది. వెంకటేష్‌ ఫార్మెట్‌లో కొన్ని సీన్లు వుంటాయి. అతని స్నేహితులుగా ముగ్గురూ బాగా నటించారు. వినోదాన్ని పండించారు. ఇక మిగిలిన నటీనటులుకూడా బాగా ఎంటర్‌టైన్‌కు సహకరించారు. 
 
వినోదం కోసం దర్శకుడు చేసే కృషి అభినందనీయమనే చెప్పాలి. ఎ.ఎం.రత్నం కుమారుడుగా అంతకుముందు సినిమాలు చేసినా స్ట్రెయిట్‌ తెలుగు సినిమా ఇది. అందులోనూ సన్నివేశపరంగా కథనంబాగుంది. ముగింపులో వచ్చే ట్విస్ట్‌లు ఎవరి ఊహకు అందకుండా వుంటాయి. వెన్నెల కిశోర్‌ పాత్ర ముంబైనుంచి వున్నా సెకండాఫ్‌లో కథను తనే నడుపుతాడు. సామజవరగమనలో వెన్నెల కిశోర్‌ పాత్ర హైలైట్‌. ఇందులో ఊహకందని విధంగా ఆ పాత్రను దర్శకుడు డిజైన్‌ చేసి చూపించాడు. దానికి అందరూ ఫిదా కావాల్సిందే. 
 
ప్రేక్షకుల వినోదం  కోసం సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకున్నాడు దర్శకుడు. కెమెరాపనితనం, సంగీతపరంగా బాణీలు పర్వాలేదు. ఎక్కడా వల్గారిటీ లేకుండా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన హీరో పాత్రతీరు, ఉన్నతస్థాయికి చెందిన హీరోయిన్‌ మధ్య ట్రాక్‌ కన్వీనియస్‌గా వుంది. సంభాషణలపరంగా సహజంగా వున్నాయి. మొత్తంగా ఈ సినిమాను కుటుంబసభ్యులతో హాయిగా చూసేట్లుగా వుంది. 
రేటింగ్‌: 3/5 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు