తెలుగుదేశం పార్టీలు జీవం పోసేలా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కోడలు, నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్త ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీకి మరింత ఊపు వస్తుందని భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయినా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఆ పార్టీ తలమునకలై వుంది. బలంగా ఉన్న వైసీపీని ఎదురించి, పోరాడాలంటే బలమైన నాయకత్వం అవసరమని పార్టీ పెద్దలు చెప్పడంతో ఇక చంద్రబాబు నారా బ్రాహ్మణిని రంగంలోకి దించాలని భావిస్తున్నారు.
గత కొంత కాలంగా ప్రత్యక్షంగా కాకపోయినా రాజకీయాలను కూడా బ్రాహ్మణి పరిశీలిస్తున్నారు. పార్టీ తరఫున సోషల్ మీడియా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. తాజాగా చంద్రబాబు నివాసంలో నారా బ్రాహ్మణి ఆధ్వర్యంలో సోషల్ మీడియా కార్యకర్తలతో ఓ సమావేశాన్ని నిర్వహించారట. ఈ సందర్భంగా సోషల్ మీడియా పనితీరుపై ఆమె ఓ రూట్ మ్యాప్ సిద్ధం చేశారట. తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియాలో కాస్త బలం ఎక్కువగానే ఉంది. చంద్రబాబు చేపడుతోన్న ప్రజా ఉద్యమాలు, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడంలోనూ సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంటోంది.
తాజాగా విశాఖలో పర్యటించిన చంద్రబాబు యాత్రను వైసీపీ అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దానికి టీడీపీ సోషల్ మీడియా విభాగం గట్టిగా కౌంటర్లు ఇచ్చింది. ఈ అంశాలన్నీ పార్టీ బలం పుంజుకోవడానికి దోహదపడతాయని పార్టీ నేతలు నమ్ముతున్నారు. అందుకే నారా బ్రాహ్మణిని రంగంలోకి దించాలనుకుంటున్నట్లు చంద్రబాబు స్కెచ్ వేస్తున్నారని టాక్ వస్తోంది.