మాట్లాడే స్వేచ్ఛ లేదు.. ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా

ఆదివారం, 25 ఆగస్టు 2019 (14:55 IST)
కేరళ రాష్ట్రానికి చెందిన యువ ఐఏఎస్ అధికారి ఒకరు తన పదవికి రాజీనామా చేశారు. మాట్లాడే స్వేచ్ఛలేనపుడు ఐఏఎస్ ఉద్యోగం తనకెందుకు అంటూ ఆయన ప్రశ్నిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కేరళకు చెందిన యువ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథన్ దాద్రా నగర్ హవేలీలో పవర్ అగ్రికల్చర్, పట్టణాభివృద్ధి కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన తనను రిలీవ్ చేయాల్సిందిగా హోంశాఖకు లేఖ రాశారు. 
 
ఐఏఎస్ కావడం వెనుక ఉన్న తన ఉద్దేశం నెరవేరడం లేదన్నారు గొంతు లేని వాళ్లకు తాను గొంతుకను కావాలని నాడు అనుకున్నానని, కానీ తాను ఇప్పుడు గొంతు విప్పే పరిస్థితిలో లేనని ఆవేదన వ్యక్తంచేశారు. వ్యక్తిగత భావవ్యక్తీకరణే తనకు ముఖ్యమని, సర్వీస్ నుంచి తనను రిలీవ్ చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 
 
జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను భారత ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత తన ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకోలేకపోయానని గోపీనాథన్ వ్యాఖ్యానించారు. కాగా, కన్నన్ గోపీనాథన్ గతంలోనూ ఓసారి వార్తల్లోకి ఎక్కారు. గతేడాది కేరళలో సంభవించిన వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. 
 
దాద్రానగర్ హవేలీ కలెక్టర్‌గా ఉన్న కన్నన్ ఓ సామాన్యుడిలా మారి వరద సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం సంచలనమైంది. ఆ సందర్భంగా మూటలు కూడా మోశారు. ఆయనను చూసిన ఓ వ్యక్తి మూటలు మోస్తున్న వ్యక్తి కలెక్టర్ అని గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయనపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది.
 
కాగా, మాట్లాడే స్వేచ్ఛ లేని తనకు ఈ ఉద్యోగం వద్దని లేఖ రాసి ఇప్పుడు మరోమారు వార్తల్లో వ్యక్తి అయ్యారు. స్వతంత్ర భావాలు, సమాజంపై వ్యక్తిగత అభిప్రాయాలు, సేవాభావం కలిగిన కన్నన్.. విధుల్లో ఇమడలేకపోతున్నట్టు ఆయన సహచరులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు