సాధారణంగా ఇంటి స్థలం ఎంపిక అనేది వాస్తు శాస్త్రానికి అనుగుణంగా సాగాలి. అపుడే ఆ ఇంటిలో నివశించే వారు సుఖశాంతులతో జీవించగలుగుతారని వాస్తు నిపుణులు చెపుతున్నారు. అలాంటి ఇంటి స్థలం ఎంపిక ఏ విధంగా జరగాలన్న అంశాన్ని పరిశీలిస్తే...
పొడవు ఎక్కువగా ఉండి, భుజాల్లో హెచ్చు తగ్గులుగా ఉండే స్థలం ఎంపిక మంచిది కాదంటున్నారు. ఇలాంటి స్థలంలో ఇంటి నిర్మాణం జరిగితే పశుహాని, అనారోగ్యం కలిగిస్తుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే, స్థలానికి సంబంధించిన నాలుగు భుజాల్లో హెచ్చుతగ్గులున్నా, నాలుగు భుజాల కంటే ఎక్కువ భుజాలు కలిగి ఉన్న స్థలం గృహ నిర్మాణానికి పనికిరాదంటున్నారు. ఇలాంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేపడితే అశుభాలు కలుగుతాయని వాస్తు చెబుతోంది.
ఢమరకం ఆకారంలో ఉండే స్థలం కూడా మంచిది కాదంటున్నారు. ఇలాంటి నేలలో ఇంటి నిర్మాణం చేపట్టినట్టయితే సంతాన లేమి, అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని చెపుతున్నారు. విసనకర్ర ఆకార స్థలం.. ఎటువంటి ఆస్తిమంతుల్నైనా ఆర్థికంగా చితికి పోయేలా చేస్తుందంటున్నారు. అర్థ చంద్రాకార స్థలాల వలన మానసిక భ్రాంతి కలుగుతుంది. తరచుగా దోపిడీలు జరుగుతుంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.