ఎలక్టోరల్ బాండ్ల వల్ల అవినీతి తగ్గింది... అదొక మంచి పథకం : ప్రధాని నరేంద్ర మోడీ

వరుణ్

మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (10:15 IST)
దేశంలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల వల్ల అవినీతి తగ్గిందని, ఈ పథకం ఎంతో మంచిదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఈ ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టేందుకు ఉద్దేశించిన పథకంగా ఆయన అభివర్ణించారు. వాస్తవికమైన పరిస్థితులు ప్రతిబింబించినప్పుడు ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపపడతారని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ ఎలక్టోరల్ బాండ్ల అంశంపై స్పందించారు. ఎలక్టోరల్ బాండ్లపై ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఒక నిర్ణయానికి సంబంధించి లోటుపాట్లు ఉండబోవని తాను ఎప్పుడూ చెప్పలేదని మోడీ అన్నారు. ఎన్నికల్లో నల్లధనం చాలా ప్రమాదం అని చాలా కాలంగా చర్చ జరుగుతోందని, ముగింపు పలకాలంటూ చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయని ఆయన ప్రస్తావించారు. 
 
"ఎన్నికల్లో అన్ని పార్టీలు ఖర్చు పెడుతున్నాయి. నా పార్టీ కూడా ఖర్చు పెడుతోంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టే ఈ డబ్బుని జనాల నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఎన్నికల్లో ఈ నల్లధనం నుంచి ఎలా విముక్తి లభిస్తుంది? పారదర్శకత ఎలా వస్తుంది?. మా ప్రభుత్వం ఒక చిన్న మార్గాన్ని అన్వేషించింది. ఇది సంపూర్ణమైన మార్గం అని మేము ఎప్పుడూ చెప్పలేదు" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
 
రాజకీయ విరాళాలన్నింటినీ చెక్కుల రూపంలో తీసుకోవాలని గతంలో బీజేపీ నిర్ణయించిందని, అయితే వ్యాపారవర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయని మోడీ చెప్పారు. ఈ విధానం ఏ రాజకీయ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయో ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉంటుందని అందుకే వెనక్కి తగ్గామన్నారు. విరాళాల విషయంలో 1990 దశకంలో బీజేపీకి చాలా సమస్యలు ఎదురయ్యాయని మోడీ ప్రస్తావించారు. ఈ పరిస్థితులు అన్నీ తనకు తెలుసునన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ లేకపోతే డబ్బు ఎలా వచ్చిందో, ఎక్కడికి పోయిందో తెలుసుకునే అధికారం ఏ వ్యవస్థకు ఉంటుందని ప్రధాని మోడీ ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు