తెలంగాణా బిల్లు పెడితే ఎవరూ ఏమీ చేయలేరు: సబ్బం

గురువారం, 3 మార్చి 2011 (20:50 IST)
ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పు లేదని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. తన ఇంటిపై దాడి చేసిన వ్యక్తులను ఉద్దేశించి అన్నారు తప్పించి తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి కాదని చెప్పారు.

జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కావూరి ఇంటిపైకి న్యాయవాదులు ఆందోళనకు దిగారనీ, వారిని ఉద్దేశించి కావూరి సాంబశివరావు వ్యాఖ్యానించారు తప్పించి మరొకటి కాదన్నారు. వారినంటే తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ఎందుకు స్పందించారో... రాజీనామాల వరకూ ఎందుకు వెళ్లారో తనకైతే అర్థం కావడం లేదన్నారు.

ఏదేమైనా కేంద్రం పార్లమెంటులో రాష్ట్ర విభజనకు బిల్లు ప్రవేశపెడితే కావూరిగానీ, సబ్బం హరి కానీ ఎవరూ ఆపలేరనీ, కాకపోతే అది సీమాంధ్ర ప్రజలకు ఇష్టం లేని వ్యవహారం కనుక లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి వెనక్కి రావడం తప్పించి మరేమీ చేయలేమని అన్నారు.

మొత్తమ్మీద తెలంగాణా సమస్య ఓ కొలిక్కి వచ్చినట్లే కనబడుతోంది. యూపీఎ సర్కార్ తెలంగాణా అంశంపై అవుననో.. కాదనో చెప్పక తప్పని పరిస్థితి నెలకొంది.

వెబ్దునియా పై చదవండి