సూట్‌కేసు బాంబు కేసులో మంగళి కృష్ణకు ఐదేళ్ళ శిక్ష!
బుధవారం, 25 ఏప్రియల్ 2012 (17:23 IST)
సూట్‌కేసు బాంబు కేసులో మంగళి కృష్ణతో పాటు.. ఈ కేసులో దోషులుగా ఉన్న మిగిలిన ముగ్గురికి ఐదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఐదేళ్ళ శిక్ష పడిన మంగళి కృష్ణ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. ఈ కేసు తీర్పు వెలువడిన తర్వాత మంగళి కృష్ణను కస్టడీకి తీసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.
ఈ కేసులో మంగళి కృష్ణ బుధవారం కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణ అనుచరులు అక్కడకు భారీగా తరలి వచ్చారు. దీంతో కోర్టు వద్ద, అనంతపురంలో భారీగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. బుధవారం తుది తీర్పు కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు.
ఇదిలావుండగా, 2001లో మాజీమంత్రి, దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవిని చంపేందుకు సూటు కేసు బాంబు ప్రయోగించారని మంగళి కృష్ణపై అభియోగం నమోదైవుంది. ఇన్నాళ్లుగా ఈ కేసు నడిచింది. కేసులో వాదనలు విన్న కోర్టు బుధవారం అంతిమ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 14మందిని నిందితులుగా పేర్కొన్నారు.