తన దృష్టిలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఒక సాదాసీదా (నార్మల్) నటుడు మాత్రమేనని హీరో మంచు విష్ణు అన్నారు. ప్రభాస్ ఒక లెజెండ్ యాక్టర్ కాదు. ఆయన లెజెండ్‌గా మారడానికి ఇంకా సమయం పడుతుందన్నారు. మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం "కన్నప్ప". జూన్ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ప్రచారం కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా తాజాగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు.
"నా దృష్టిలో ప్రభాస్ నార్మల్ యాక్టర్ మాత్రమే. లెజెండ్ యాక్టర్ కాదు. ఆయన లెజెండ్‌గా మారడానికి ఇంకా సమయం పడుతుంది. కానీ, మోహన్ లాల్ మాత్రం లెజెండరీ యాక్టర్. ఎందుకంటే కాలం ఆయనను లెజెండరీ నటుడుని చేసింది. రాబోయేకాలంలో ప్రభాస్ చేసే సినిమాలు తప్పకుండా ఏదో ఒకరోజు ఆయన్ను లెజెండ్‌ను చేస్తాయి అని అన్నారు.
దీంతో విష్ణు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై డార్లింగ్ ఫ్యాన్స్, నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. ఇక "కన్నప్ప"లో ప్రభాస్ అతిథి పాత్రలో నటించిన విషయంతెల్సిందే. ఇప్పటికే ఆయన తాలూకు పోస్టర్లు, వీడియోలు విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.