156 ఏళ్ళ క్రితం.. బందరు శవాలగుట్ట

సోమవారం, 2 నవంబరు 2020 (07:08 IST)
నౌకా వ్యాపారంలో నాడు  అగ్రగామిగా, దక్షిణ భారతదేశం లోనే ముఖ్య ఓడరేవు ప్రాంతంగా విరాజిల్లుతున్న బందరు ఆ భయంకర ఉప్పెనలో చిగురుటాకులా వణికిపోయింది. ఆ ఉప్పెన కారణంగా బందరు  సముద్రతీరంలో  భారీ ఇసుకమేటలు వేయడంతో నాటి నుండి బందరు నౌకాయానంకు చరమగీతం పాడినట్లైంది.

ఓడల రాకపోకలు మహా కష్టమైంది..నేటికీ ఆ ఇసుకమేటలు బందరు పోర్టుకి శాపం అయిందని తద్వారా బందరు అభివృద్ధి కుంటుపడిందని చెప్పవచ్చు.
 
సరిగ్గా  156 సంవత్సరాల కిందటి నాటి బందరు ఉప్పెన గురించి మనలో చాలా మందికి తెలియదు. రక్తాక్షి నామ సంవత్సరం1864 నవంబర్ 1 వ తేదీన బందరులో సముద్ర కెరటాలు 13 అడుగుల ఎత్తున ఎగసిపడి ,  780 చదరపు మైళ్ళ పరిధిలో ఆ ఉప్పెన ప్రాణ..ఆస్తి తీవ్ర నష్టం కల్గించింది.

నాడు బందరు పట్టణంలో 65 వేల మంది జనాభా ఉండగా  అందులో  30 వేల మంది తమకేమి జరుగుతుందో తెలిసేలోపు  ఆ కాళరాత్రి  జలసమాధి అయ్యారు. సముద్రం తీరాన్ని దాటి, 17 మైళ్ళు ఊళ్ళపై   చొచ్చుకొచ్చి, జనావాసాలని ముంచివేసింది.

నేటి కాలేఖాన్ పేట ప్రాంతంలోని  శివగంగ బ్రాహ్మణ అగ్రహారంలోని 700 మంది ప్రజలు నివసించేవారని ఉప్పెన అనంతరం 630 మంది సముద్రపు రాకాసి అలలలో కొట్టుకుపోయి కేవలం 70 మంది మాత్రమే అక్కడ మిగిలేరని చరిత్రలో లిఖితమైంది.

ఇక చింతగుంటపాలెంలో పురుషోత్త సోమయాజి శర్మ అనే ఒకాయన సముద్ర కెరటాలకు ఎక్కడికో  కొట్టుకొనిపోయి తాటిచెట్టుపై  మొవ్వలో చిక్కుకొని తర్వాత రోజున తాడిచెట్టు దిగివచ్చి వచ్చినట్లు నాడు ప్రజలు చెప్పుకొనేవారు. 

బందరులో కోటావారితుళ్ళా సెంటర్  పాత దుర్గామహల్  ప్రస్తుత యాక్సెస్ బ్యాంకు వద్ద కాండ్రేకుల జోగి జగన్నాధ పంతులు గారి మేడ ( డిసెంబర్ 26 వ తేదీ 1988 వరకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంగా కొనసాగింది.

దివంగత శాసనసభ్యులు వంగవీటి మోహనరంగా హత్య అనంతరం జరిగిన అల్లర్లలో ఈ భవనానికి కొందరు నిప్పు పెట్టి తగలబెట్టారు )  లోఆ ఉప్పెన రాత్రి వందమందికి పైగా ప్రజలు  ఆ భవనంలో తల దాచుకొని తమ ప్రాణాలను రక్షించుకొన్నారు.

నాటి జిల్లా కలెక్టర్ థారన్ హిల్ ఉప్పెన అనంతరం చేసిన సేవలు చిరస్మరణీయం.  ఆయన ఆధ్వర్యంలో ఆంగ్లేయ అధికారులు పొలిసు సిబ్బందితో కొన్ని బృందాలుగా ఏర్పడి పట్టణమంతా ఉన్న శవాల గుట్టలను ..పశువుల కళేబరాలను భూమిలో పూడ్చిపెట్టారు...ఎడ్మన్డ్ షార్కి తమ పాఠశాలకు చెందిన 30 విద్యార్థినులు సముద్రంలో మునిగిచనిపోగా.. వారినందరిని  ఆ సమీపంలో ఖననం చేశారు. ( అది ప్రస్తుతం రైలుపేట ఎలిమెంటరీ పాఠశాల సమీపంలో వైస్సార్  మునిసిపల్ పార్కుగా నేడు అక్కడ ఉంది).

అలాగే పట్టణ పొలిమేర్లలో ఖనన కార్యక్రమానికి నోచుకోని అనేక శవాలను పీక్కుతినేందుకు వందలాది రాబందులు గుంపులు గుంపులుగా ఆకాశం నుంచి కిందకు వాలిన భీకర దృశ్యాలు చూసి ఎందరో చలించిపోయారు.

ఇంతటి ఉప్పెనలో బతికిన కుక్కలు సైతం శవాహారంకు అలవాటుపడ్డాయట ...  నేడు ఆనందపేట సమీపంలో ఉన్న సెయింట్ మేరీస్ చర్చి ఆ ఉప్పెన విలయతాండవంకు సజీవ సాక్ష్యంగా నిలిచింది.

అక్కడ సముద్రపు నీరు చర్చి గోడలు ఎనిమిది అడుగుల మేర ప్రవహించిందని నాటి తరం చెప్పుకొన్నారు.. సున్నం ఎంత వేసినప్పటికీ ఇప్పటికి అక్కడవరకు ఒక ఉప్పునీటి చార కనబడుతూనే ఉంటుందని కొందరు అంటుంటారు.

ఉప్పెన అనంతరం బందరు పరిసర ప్రాంతాలపై  సముద్రపు నీరు ప్రవహించిన  కారణంగా వ్యవసాయ భూములు చౌడు బారిపోయాయి. నూతులలో తీయని నీరు ఉప్పునీరుగా మారిపోయాయి. ప్రజలకు తాగునీరు దొరకడం ఎంతో కష్టమైంది.

నాడు కొందరు వ్యాపారవర్గాలు తాగునీటికోసం 17 వేల రూపాయలు విరాళంగా సేకరించి జిల్లా కలెక్టర్  థారన్ హిల్ కు అందించారు. ఆయన మరో 30 వేల రూపాయలను సమీకరించి నాటి నాగులేరు ( ఖాలేఖాన్ పేట  మంచినీటి కాలువ ) నుంచి కోనేరు సెంటర్ వరకు భూగర్భ పైప్ లైన్  నిర్మించారు. అప్పట్లో టౌన్ ప్రజానీకo మొత్తం తాగునీటి అవసరాలను తీర్చింది నాటి కోనేరు.

ఆనాటి ఉప్పెనలో వేలాదిమంది జలసమాధి కాగా,అంతటి ఘోర విషాదంలోనూ కొందరు స్వార్ధపరులు ధనమే పరమావధిగా మృతుల శరీరాలపై బంగారు ఆభరణాలు సేకరించే పనిలో నిమగ్నమైయ్యారంట.

వీరు బస్తాల కొద్ది బంగారం శవాలపై సేకరించి వాటిని కరిగించి బంగారు ఇటుకలుగా మార్చి ఆ తర్వాత పట్టణంలోనే అత్యంత ధనవంతులుగా రూపాంతరం చెందారని అప్పట్లో చెప్పుకొన్నారు.

అయితే చనిపోయినవారి శాపం తగిలిన కారణంగా  ఆ కుటుంబంలో మూడు తరాల వరకు  ఒక వ్యక్తికి భోజనం చేస్తుంటే కంచంలో అన్నం పురుగులుగా మాదిరిగా లుకలుకలాడుతూ  కనిపించేదని దాంతో కళ్ళకు గంతలు కట్టుకొని ఆహరం తీసుకొనేవారని వృద్ధతరం వారు తమ పిల్లలకు చెప్పేవారు.
 
ఈ ఉప్పెన అనంతరం ఎందరో బందరు ను విడిచి వేరే ప్రాంతాలకు తరలిపోయారు. ముఖ్యంగా నాటి బ్రిటిష్ పాలకులు బందరు పట్టణంపై భ్రమలు వదులుకొన్నారు. తమ స్థావరాలలో  ప్రాణ ఆస్తి నష్టం అధికంగా కావడంతో తమ మకాన్ని మద్రాస్ కు తరలించారు.  బందరులో ఆనాటి  విషాదం ఏ ఒక్కరు గుర్తు చేసుకోకపోవడం విచారకరం.

పరాయి పాలకులైన నాటి ఉప్పెనలో మృతి చెందిన 30 వేల ఆత్మలకు శాంతి కలగాలని బందరు కోట రోమన్ కాథలిక్ మిషన్ సెమెట్రీ లో ఒక భారీ స్థూపం నిర్మించారు. నేటికీ ఆ నిర్మాణం నాటి ప్రకృతి శాపం గుర్తు చేస్తూనే ఉంటుంది.

కనీసం  పట్టుమని పదిమందైన ఆ ప్రాంతానికి వెళ్లి 30 వేలమంది ఆత్మలకు ఒక నివాళి ప్రకటించడమో  లేక  ఒక్క పుష్పగుచ్ఛమైన ఆ సజీవ సాక్ష్యమైన ఆ స్తూపం ముందు ఉంచకపోవడం ఎంత బాధాకరమో కదూ?

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు