తాడేపల్లి ఇంటికి ఆస్తిపన్ను చెల్లించని సీఎం జగన్ : నోటీసులు?

గురువారం, 1 జులై 2021 (08:26 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎంతో భిన్నంగా ఉంది. ప్రజలు నుంచి పన్నులు ముక్కుపిండి వసూలు చేయిస్తున్న ఆయన.. తన సొంత ఇంటికి మాత్రం పన్నులు చెల్లించడం లేదు. తాడేపల్లి ప్యాలెస్‌గా విపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్న జగన్ నివాసానికి గత రెండేళ్లుగా పన్ను చెల్లించలేదు. ఈ ఇంటికి దాదాపు 16 లక్షల రూపాయలకు పైగా పన్ను చెల్లించాల్సివుంది. మునిసిపల్‌ శాఖ వెబ్‌సైట్‌లోనే ఈ విషయం వెల్లడించారు. ఈ నివాసం గుంటూరు జిల్లాలో వుంది.
 
గుంటూరు జిల్లా తాడేపల్లి మునిసిపాలిటీ పరిధిలో తాడేపల్లిలో సీఎం జగన్‌కు భారీ నివాసం ఉంది. అందులో రెండు బ్లాక్‌లున్నాయి. 1750 చదరపు మీటర్ల పరిధిలో ఆఫీసు ఉంది. ఇందులో గ్రౌండ్‌ఫ్లోర్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌ ఉన్నాయి. మునిసిపల్‌ రికార్డు ప్రకారం దీని చిరునామా.. డోర్‌ నంబరు 12-353/2/2 పార్సివిల్లే 47, ఆంధ్రరత్న కట్ట, రెవెన్యూ వార్డు నంబరు 12, తాడేపల్లి - 522501. ఇక... ఇదే ఆవరణలో 219 చదరపు మీటర్లలో నివాసంఉంది. దీని డోర్‌ నంబర్‌ 12-353/2/5. ఇందులో గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్లు ఉన్నాయి. ఈ రెండూ సీఎం సతీమణి వైఎస్‌ భారతీ రెడ్డి పేరిట ఉన్నాయి. 
 
మునిసిపల్‌ రికార్డుల ప్రకారం ఆఫీసు కోసం ఉపయోగిస్తున్న భారీ భవనాన్ని కమర్షియల్‌గా, ఇంటిని నివాస ప్రాంతంగా చూపించారు. వార్షిక రెంటల్‌ విలువను ఆఫీసుకు రూ.13,64,131గా, ఇంటికి రూ.79,524 చూపించి... ఆ మేరకు ఆస్తి పన్ను నిర్ణయించారు. దీని ప్రకారం.. ఆఫీసుకు ఏటా రూ.4,41,980... ఇంటికి 19,752 చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంది. కానీ.. జగన్‌ సీఎం అయినప్పటి నుంచి ఇంటికి కానీ, కార్యాలయానికి కానీ ఆస్తి పన్ను చెల్లించడంలేదు.
 
మునిసిపల్‌శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారమే కార్యాలయంపై రూ.13,25,940 పన్ను బాకీ పడ్డారు. ఇంటికి సంబంధించి 59,256 పన్ను బకాయి ఉంది. అంటే... మునిసిపల్‌ శాఖకు జగన్‌ రూ.13,85,196 పన్ను బాకీ పడ్డారు. ఏళ్ల తరబడి పన్నులు కట్టకుండా ఉంటే మునిసిపల్‌ శాఖ ఊరుకోదు కదా! ఆటోమేటిక్‌గా పెనాల్టీలు పడతాయి. ఆ జరిమానా రూ.2,82,103. వెరసి అసలూ, జరిమానాలు కలిపి భారతీ రెడ్డి మునిసిపల్‌ శాఖకు రూ.16,67,299 బాకీ పడ్డారు. 

వెబ్దునియా పై చదవండి