నిజానికి రాష్ట్రంలో 25 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఒక్కో స్థానాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే, అరకు లోక్‌సభ నియోజకవర్గంలో పాడేరు, పార్వతీపురం జిల్లాల ఏర్పాటుకు సూచించినట్లు తెలిసింది.
జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 38 రెవెన్యూ డివిజన్లలో మార్పులకు సూచించినట్లు సమాచారం. కొత్తగా 9 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, 3 డివిజన్ల రద్దుకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. ఏపీలో 25 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామంటూ గడిచిన ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామంటూ పార్టీ ఎన్నికల ప్రణాళికలో వైసీపీ చెప్పింది.
ఆ ప్రకారంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, కొత్త జిల్లాల ఏర్పాటుపై కొంతమంది అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కొత్త జిల్లాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సమీక్షలు నిర్వహించి ఓ నివేదికను తయారు చేసింది. ఆ ప్రకారంగా కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.