కరోనా పాజిటివ్ తో, అస్వస్థతతో హైదరాబాదులో చికిత్స పొందుతున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యంపై నిన్ననే హైదరాబాద్ వైద్యులతో సీఎం జగన్ మాట్లాడారు. మీ ఆరోగ్య పరిస్థితిపై నిన్న నేను ఆసుపత్రి డాక్టర్లతో మాట్లాడానని సీఎం, నేరుగా గవర్నర్ కి చెప్పారు. మీరు సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు చెప్పారని, అంతా సర్దుకుంటుందని వారు తెలిపారని వైయస్.జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ కు వివరించారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపిన ముఖ్యమంత్రి వైయస్.జగన్, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు స్పష్టం చేశారు. ఈ నెల 15న నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టులో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు గుర్తించారు. గవర్నర్ బిశ్వభూషణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కూడా ఏఐజీ ఆస్పత్రిలో బిశ్వభూషణ్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విశ్వ భూషణ్ బుధవారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురవడంతో, హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ ఇపుడు ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతోందని భావిస్తున్నారు.