కార్తీక దీపారాధనతో అశ్వమేధ యాగ ఫలితం : విజ‌యేంద్ర స‌రస్వ‌తి

మంగళవారం, 1 డిశెంబరు 2020 (07:00 IST)
పవిత్రమైన కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుందని కంచి కామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌రస్వ‌తి ఉద్ఘాటించారు. 
 
తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ప‌రేడ్ మైదానంలో సోమ‌వారం రాత్రి జ‌రిగిన కార్తీక మ‌హా దీపోత్స‌వంలో కంచి కామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌రస్వ‌తి కార్తీక దీపం వెలిగించారు. 
 
టిటిడి ఉన్నతాధికారులతోపాటు మహిళలందరూ నేతిదీపాలు వెలిగించారు. కార్తీక మ‌హా దీపోత్స‌వంలో స్వామీజీ అనుగ్ర‌హ భాష‌ణం చేశారు. 
 
కార్తీక మాసంలో దీపపూజ, దీపదానం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమని స్వామీజీ అన్నారు. దీపారాధన వల్ల దేవతలు, ఋషులు, పితృదేవతలు సంతోషిస్తా‌రని, దేశంలోని అన్ని పుణ్యతీర్థాల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుందన్నారు. ఆవునెయ్యితో దీపారాధన అత్యంత శ్రేష్టమన్నారు.

దీపారాధనతో నేత్రశక్తి పెరుగుతుందని, ధర్మార్థకామ మోక్షాలు సిద్ధిస్తాయని చెప్పారు. సంధ్యా సమయంలో ప్రతి ఇంటి ముందు దీపం వెలిగించి భగవంతుని ఆరాధించాలన్నారు. పద్మ పురాణం, వామన పురాణం తదితర పలు పురాణాల్లో దీప ప్రాశస్త్యం గురించి వివరించారని చెప్పారు.

టిటిడి శ్రీ మహావిష్ణువు క్షేత్రంలో కార్తీక దీపోత్సవం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. లోక క్షేమం కోసం టిటిడి ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. మహా దీపోత్సవం ద్వారా శ్రీవారు దేశానికి ఆ‌రోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి ప్రసాదించాలని స్వామీజీ ప్రార్థించారు.
 
టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం మైదానంలో వైభ‌వంగా కార్తీక మ‌హా దీపోత్స‌వం
టిటిడి ఆధ్వ‌ర్యంలో మొద‌టిసారిగా నిర్వ‌హించిన‌ కార్తీక మ‌హాదీపోత్స‌వం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ప‌రేడ్ మైదానంలో సోమ‌వారం రాత్రి నిర్వ‌హించిన ఈ దీపోత్స‌వానికి 500 మంది మ‌హిళ‌లు విచ్చేసి నేతిదీపాలు వెలిగించారు.

ప‌విత్ర‌మైన కార్తీక మాసంలో నెల రోజుల పాటు చేప‌ట్టిన హోమాలు, వ్ర‌తాలు, పూజాకార్య‌క్ర‌మాల్లో భాగంగా ఈ దీపోత్స‌వాన్ని టిటిడి  నిర్వ‌హించింది. క‌ంచి కామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌రస్వ‌తి స్వామివారు భ‌క్తుల‌కు అనుగ్ర‌హ భాష‌ణం చేశారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.
 
వేద‌స్వ‌స్తితో కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. కేంద్రీయ సంస్కృత వ‌ర్సిటీ ఆచార్యులు రాణి స‌దాశివ‌మూర్తి దీప ప్రాశ‌స్త్యాన్ని తెలియ‌జేశారు. ఎస్వీ వేద వ‌ర్సిటీ ఆచార్యులు కె.పురుషోత్త‌మాచార్యులు విష్ణుస‌హ‌స్ర‌నామ పారాయ‌ణం చేశారు.

శ్రీ‌మ‌హాల‌క్ష్మీపూజ వైభ‌వంగా జ‌రిగింది. విద్యార్థినులు శ్రీ ల‌క్ష్మీ అష్టోత్త‌ర శ‌త‌నామావ‌ళి స్తోత్రాన్ని ప‌ఠించారు. ఎస్వీ సంగీత‌, నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు డా. ఉషారాణి ఆధ్వ‌ర్యంలో విద్యార్థులు అష్ట‌ల‌క్ష్మీ వైభ‌వం కూచిపూడి నృత్యం అద్భుతంగా  ప్ర‌ద‌ర్శించారు.

ఈ ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. అనంతరం పండితులు చెబుతున్న మంత్రాన్ని ప‌ఠిస్తూ మ‌హిళ‌లందరూ సామూహికంగా దీపాలు వెలిగించారు. కార్తీక మ‌హాదీపోత్స‌వంలోని దీపాలను చూడ‌డం వ‌ల్ల కీట‌కాలు, జంతువులు, చెట్లు, సామాన్య మాన‌వులు, పండితులు పున‌ర్జ‌న్మ లేకుండా మోక్షాన్ని పొందుతార‌ని పండితులు తెలిపారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్త దంపతులు,ధర్మకర్తల మండలి సభ్యులు శేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి వైద్యనాథన్ దంపతులు, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి దంపతులు,జెఈవో  పి.బ‌సంత్‌కుమార్‌ దంపతులు,జె ఈ ఓ స‌దా భార్గ‌వి,  సివిఎస్వో గోపినాథ్ జెట్టి దంపతులు, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత ,

అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి దంపతులు ,  ఎస్వీబీసీ చైర్మన్ సాయి కృష్ణ యాచేంద్ర, ఎస్వీబీసీ సిఈవో జి.సురేష్‌కుమార్‌, కేంద్రీయ సంస్కృత వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళీధ‌ర‌శ‌ర్మ‌, ఎస్వీ వేద వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న శ‌ర్మ‌, చీఫ్ ఇంజినీర్ ర‌మేష్‌రెడ్డి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు