నువ్వే అపార్థం చేసుకుంటే ఎలా... నేను ఏ తప్పూ చేయలేదు నాన్నా... ఓ విద్యార్థిని ఆత్మహత్య

వరుణ్

మంగళవారం, 6 ఆగస్టు 2024 (12:16 IST)
తండ్రి అనుమానించాడన్న మనోవేదనతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కన్నతండ్రే అపార్థం చేసుకుంటే ఎలా నాన్నా... నేను ఏ తప్పూ చేయలేదంటూ లేఖ రాసిపెట్టి ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన ఏపీలోని నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
డోన్ పట్టణానికి చెందిన జక్కి గౌరప్ప, రామేశ్వరి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం. వీరిలో పెద్దదైన రేణుక యల్లమ్మ (22) మాచర్లలోని న్యూటన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. వేసవి సెలవలు ముగించుకొని ఈమధ్య ఆమె కళాశాలకు తిరిగొచ్చింది. స్థానిక ఆంధ్రా బ్యాంకు పైనున్న కళాశాల వసతి గృహంలో తన స్నేహితులతో కలిసి ఉండేది. 
 
ఆదివారం సాయంత్రం రేణుకను చెల్లెలిగా చూసుకునే ఆమెతో పాటు ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థి ఫోన్ చేయగా పనిలో ఉండి ఆమె స్పందించ లేదు. దీంతో ఆ విద్యార్థి ఆమె తండ్రి గౌరప్పకు ఫోన్ చేసి ఆమె ఫోన్ తీయటం లేదని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి కూతురికి ఫోన్ చేసి గట్టిగా మందలించాడు. 
 
కళాశాలలో చదువుకునే అమ్మాయిలకు అబ్బాయిలతో పనేంటి, అతనెందుకు ఫోన్ చేస్తున్నాడు, ఈ విషయాన్ని కళాశాలలో తేలుస్తానంటూ ఊగిపోయాడు. రేణుక ఎంత చెప్పినా తండ్రి వినకపోగా సోమవారం తెల్లవారేసరికి కళాశాలకు వస్తాననటంతో భయపడింది.
 
తండ్రి వస్తే జరిగే పరిణామాలను ఊహించుకుంటూ తన మరణంతోనే సమస్య తీరుతుందని భావించి.. తాను ఏ తప్పూ చేయలేదని ఉత్తరం రాసి వసతి గృహంలో ఖాళీగా ఉన్న గదిలో ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం కూతురు కోసం వసతి గృహానికి తల్లిదండ్రులు రావటంతో ఆమె స్నేహితులు రేణుక కోసం వెతుకులాట ప్రారంభించారు. 
 
ఒక గదిలో ఆమె ఫ్యానుకు ఉరి వేసుకొని కనిపించటంతో భీతిల్లిన విద్యార్థినులు గట్టిగా కేకలు వేయగా వసతి గృహ సిబ్బంది, మృతురాలి తల్లిదండ్రులు అక్కడి చేరుకున్నారు. విషయాన్ని పోలీసులకు తెలపటంతో పట్టణ సీఐ బ్రహ్మయ్య సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. ఆమె స్నేహితుల నుంచి వివరాలు సేకరించి మృతురాలి తండ్రి గౌరప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు