భారతీయ జనతా పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట మార్చారు. నిన్నామొన్నటివరకు మూడు రాజధానుల అంశంపై నోరు మెదపని ఆయన ఇపుడు పల్టీ కొట్టారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. ఏపీలో ఖాళీగా ఉన్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక జరుగనుంది. ఇక్కడ నుంచి పోటీ చేయాలని పరితపిస్తున్న ఏపీ బీజేపీ శాఖ ఇపుడు రాజధాని అమరావతి అంశంపై క్లారిటీ ఇచ్చింది.
ముఖ్యంగా, ఒక రాష్ట్ర రాజధాని అంశంలో తమకుగానీ, కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వానికిగాని ఎలాంటి సంబంధం లేదని చెబుతూ వచ్చిన రాష్ట్ర బీజేపీ నేతలు ఇపుడు మాట మార్చారు. ఏపీకి ఒక్క రాజధానే ఉండాలని, అదీకూడా అమరావతిగా ఉండాలని ప్రకటించారు. పైగా, తమ పార్టీ మూడు రాజధానులకు వ్యతిరేకమని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు సెలవిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రతినిధిగా తాను మాట్లాడుతున్నానని సోము వీర్రాజు ప్రకటించారు. అమరావతిలో రూ.1800 కోట్లతో నిర్మిస్తున్న ఎయిమ్స్ ఆసుపత్రి ఆగలేదని, దుర్గమ్మ ఫ్లైఓవర్‌ను పూర్తి చేశామని... మోడీ అమరావతి వైపే ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు.