తాడేపల్లిగూడెంలో టీడీపీ - జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఎన్నికల బహిరంగ సభ బుధవారం ప్రారంభమైంది. ఈ సభ కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌లు సభా వేదిక వద్దకు చేరుకున్నారు. వీరితో పాటు.. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ, పార్టీ అగ్రనేతలు కూడా అక్కడకు చేరుకోవడంతో జెండా సభా ప్రాంగణం వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. తాడేపల్లిగూడెంలో తెలుగు జన విజయకేతనం నినాదం పేరుతో ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. కాగా, ఇటీవల ఇరు పార్టీల అగ్రనేతలు 175 సీట్లకు గాను 99 అసెంబ్లీ స్థానాల్లో సీట్ల పంపిణీతో పాటు తమ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ జాబితా ప్రకటించిన తర్వాత ఉమ్మడిగా చేపట్టిన తొలి బహిరంగ సభ ఇదే కావడం గమనార్హం. టీడీపీ - జనసేన ఉమ్మడి సభకు జెండా అనే నామకరణం చేయగా, ఈ సభ ద్వారా ఇరు పార్టీల శ్రేణులకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు దిశానిర్దేశం చేయనున్నారు.
మరోవైపు, వైకాపాను వీడి జనసేన పార్టీలో చేరిన అధికార వైకాపా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ, సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ప్రకటనలో తమ పార్టీ కార్యకర్తల్లో కొంత అసంతృప్తి నెలకొన్న విషయం తెల్సిందే. అయితే, జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకునే ఎలాంటి నిర్ణయానికై అందరం కట్టుబడి ఉంటామని తెలిపారు. వైకాపా పాలనలో న్యాయం, ధర్మం లేవని, అధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది విమర్శించారు.
వైకాపాపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. పోలవరం ప్రాజెక్టును గత టీడీపీ ప్రభుత్వం 70 శాతం పూర్తి చేస్తే మిగిలిన 30 శాతం పనులను వైకాపా ప్రభుత్వం పూర్తి చేయలేక పోయిందని విమర్శించారు. మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ ప్రాజెక్టు దివిసీమ ప్రాంతానికి తీరని కల అని, దాన్ని నిజం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.