క్రైస్తవుల అభ్యున్నతే లక్ష్యంగా ఏపీ సర్కార్... జెరూసలెం యాత్రకు రూ. 5 కోట్ల నిధులు
శనివారం, 24 డిశెంబరు 2016 (14:35 IST)
క్రైస్తవుల్లోని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. క్రైస్తవ మైనార్టీలకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. రాష్ట్రంలోని పలు క్రిస్టియన్ మైనార్టీ సంస్థలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ ఆయా వర్గాల ప్రజల అభ్యున్నతికి సర్కారు చర్యలు చేపడుతోంది.
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన పథకం కింద అర్హులైన క్రైస్తవ యువతకు ప్రభుత్వం చోదుడు వాదోడుగా నిలుస్తోంది. పలు ప్రైవేటు కంపెనీల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. 2016-17 సంవత్సరానకి గాను 716 మంది యువతకు శిక్షణ అందిస్తున్నారు. ఈ ఏడాది 2 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టకొంది. ఇందుకోసం మూడు కోట్ల 20 లక్షల రూపాయలు కేటాయించింది.
ఐటీలోనూ మేటిగా శిక్షణ
2016-17 సంవత్సరానికి గాను ఐటీలో క్రిస్టియన్ మైనార్టీ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. దీంట్లో భాగంగా... సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎనలిస్టు, ఎండ్రాయిడ్ అప్లికేషన్ డెవలపర్లుగానూ, జ్యూట్ బాగ్ తయారీలోనూ, కంప్యూటర్ న్యుమరికల్లీ కంట్రోల్డ్ (సీఎన్సీ) ఆపరేటర్ గాను ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఆన్ జాబ్ ట్రైనింగ్ తరహాలో అభ్యర్థులకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేలా కంపెనీలతో క్రిస్టియన్ మైనార్టీస్ కార్పోరేషన్ అవగాహన కుదుర్చుకొంది.
గుంటూరులో క్రైస్తవ భవన నిర్మాణానికి పది కోట్లు
గుంటూరులో క్రైస్తవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పది కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందు కోసం 2 ఎకరాల భూమిని మంజూరు చేసింది. పనుల నిర్మాణం కోసం ఇప్పటికే గుంటూరు కలెక్టర్ వారి ఆధ్వర్యంలో రూ. 3కోట్ల నిధులను విడుదల చేయడం జరిగింది. వీలైనంత త్వరగా భవన నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ఏడాది జెరూసలెం యాత్రకు రూ. 5 కోట్ల నిధులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పవిత్ర జెరూసలెం యాత్రకు ఈ ఏడాది రూ. 5 కోట్ల రూపాయలను కేటాయించింది. 2016-17 సంవత్సరానికి గాను 2500 మందిని ఈ పథకం కింద జెరూసలెం యాత్రకు తీసుకెళ్తారు. ఇందుకోసం టెండర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఒక్కో యాత్రికుడికి రూ. 89 వేలు ఇందుకోసం ఖర్చు కానుంది. ఈ మొత్తంలో 20 వేల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తుంది. అయితే ఆ మొత్తాన్ని ఈ ఏడాది నుంచి రూ. 40 వేలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రిస్మస్ సంబరాల కార్యక్రమంలో ప్రకటించారు. అక్టోబర్ లో మొదటి బ్యాచ్ గా 46 మంది యాత్రికులను జెరూసలెం తీసుకెళ్లడం జరిగింది.
రాష్ట్రంలో చర్చిల మరమ్మతులు, నిర్మాణాలకు నిధులు
రాష్ట్రంలో చర్చిల నిర్మాణం, మరమ్మతుల నిర్మాణం కోసం 67 లక్షల రూపాయల గ్రాంట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులతో చర్చలను ఆధునిక పద్ధతిలో మార్పులు చేసుకోవడానికి వీలు కల్పించింది. వీటితోపాటు చర్చి నిర్వహిస్తున్న రూ. 83 లక్షల ఆర్థిక సహకారాన్ని అందించింది. వృద్ధాశ్రమాల కోసం రూ. 10 లక్షలు, అనాధల కోసం రూ. 10 లక్షలు, 55 లక్షల రూపాయలను కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం, శ్మశానవాటికల కోసం రూ. 8 లక్షలు కేటాయించింది.
ట్యాక్సీ సబ్సిడీ స్కీమ్
అర్హత కలిగిన అభ్యర్థులకు ట్యాక్సీ కొనుగోలు కోసం ప్రభుత్వం సాయం అందిస్తోంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 150 కార్లను అందించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాకు యాభై కార్లను పంపిణీ చేశారు. క్రిస్టియన్ కార్పోరేషన్ కార్ల కొనుగోలుకు సంబంధించి లక్షన్నర సబ్సిడీ అందిస్తోంది. కేవలం 20 శాతం మాత్రమే లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా కార్పోరేషన్ ఇప్పిస్తుంది.
540 మంది మహిళలకు కుట్టు మిషన్లు
ఈ ఏడాది క్రైస్తవ మహిళలకు 540 మందికి కుట్టు మిషన్లను పంపిణీ చేస్తోంది. కుట్టు మిషన్ల పనిలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఈ మిషన్లను అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు ప్రభుత్వం చేయూత అందిస్తోంది.
క్రిస్టమస్ కానుక
నిరుపేద క్రైస్తవులకు ప్రభుత్వం పండుగ కానుక అందిస్తోంది. క్రైస్తవులు క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకునేందుకు అవసరమైన సరుకులను ఉచితంగా అందిస్తోంది. తెల్లకార్డు ఉన్న లక్షలాది మంది క్రైస్తవులందరికీ ఈ పథకం ద్వారా సరుకులను పంపిణీ చేస్తున్నారు. కందిపప్పు అరకేజీ, పామాయిల్ హాఫ్ లీటర్, పచ్చి శెనగపప్పు అరకేజీ, బెల్లం అరకేజీ, గోధుమపిండి కేజీ, నెయ్యి వంద ఎం.ఎల్ అందిస్తున్నారు. ఈ పథకం పట్ల క్రైస్తవులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
క్రైస్తవుల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ బాధ్యత: మంత్రి పల్లె
అర్హులైన క్రైస్తవ విద్యార్థులకు పాఠశాలల్లో విద్యా బుద్ధులు నేర్పించడం దగ్గర్నుంచి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన వరకు నిరతంరం పనిచేస్తోందని ఐటీ, సమాచార, మైనార్టీ శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి వివరించారు. దళితుల జీవితాల్లో వెలుగులు తెచ్చే వరకు ప్రభుత్వ పథకాలను అందిస్తామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి క్రైస్తవులను జెరూసలెం తీసుకెళ్లేందుకు ఒక్కొక్కరికి రూ. 40 వేల రూపాయలు మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో తాము క్రైస్తవులను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన వివరించారు.