ప్రత్యేక హోదా ఇస్తే చాలదు... ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి... చంద్రబాబు

గురువారం, 27 ఆగస్టు 2015 (17:04 IST)
ప్రత్యేక హోదా కోసం నెల్లూరు జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఎవరూ అధైర్యపడవద్దనీ, అఘాయిత్యాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు భయభ్రాంతులు కావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని అన్నారు. కాంగ్రెస్, వైకాపా రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయని విమర్శించారు.
 
విభజన చట్టంలోని అంశాలన్నిటినీ ప్రధానితో వివరించాననీ, ఆయన తనతో సుమారు 100 నిమిషాలు మాట్లాడారని గుర్తు చేస్కున్నారు. ప్రత్యేక హోదా సమస్య పరిష్కారమయ్యే వరకూ ప్రయత్నం చేస్తూనే ఉంటానన్నారు. ఎవరూ అధైర్యపడవద్దు, అఘాయిత్యాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.
 
ఇటీవల కొందరు నాయుకు తాము అధికారంలోకి వస్తే రైతుల నుంచి తీసుకున్న భూములు తిరిగి ఇచ్చేస్తామంటున్నారు. ఇలా చెప్పేవారు అసలు రాజధాని నగరం గురించి ఏమనుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. 14వ ఆర్థిక సంఘం, 2019 సంవత్సరంలో కూడా ఏపీ ఆర్థిక లోటును ఎదుర్కొంటుందని చెప్పారని గుర్తు చేశారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విభజన కోరుకోలేదనీ, కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చేశారనీ, అందువల్ల వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం పైనే ఉన్నదని చెప్పారు. రెండు రాష్ట్రాలు కొట్టుకుంటే ఒరిగేదేమీ లేదన్న చంద్రబాబు రాష్ట్రానికి విభజన చట్టం ద్వారా రావాల్సినవన్నీ వచ్చే వరకూ విశ్రమించేది లేదని తేల్చి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి