తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పాటుపడిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారకరామారావుకు ‘భారతరత్న’ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు. తిరుపతిలో జరుగుతున్న టీడీపీ మహానాడు రెండో రోజున ఆయన మాట్లాడుతూ తెలుగు జాతికి ఎన్టీఆర్ ఆరాధ్య దైవమన్నారు. ఉన్నతమైన ఆశయాల కోసం జీవించిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్ చెప్పారని తెలిపారు. పేదరికంలేని సమాజ స్థాపనే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళని బాబు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం క్రమశిక్షణతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలన్నారు. అవినీతిపై ఎన్టీఆర్ చండశాసనుడిలా వ్యవహరించారన్న బాబు తెలుగువారి సంప్రదాయాలకు నిలువుటద్దం ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ 60 ఏళ్లు నిండాక రాజకీయాల్లోకి వచ్చారన్నారు. బచావత్ అవార్డు ప్రకారం మిగులు జలాల వినియోగానికి ఎన్టీఆర్ ప్రాజెక్టులను ప్రారంభించారని తెలిపారు.
తెలుగు భాషకు ప్రతీక ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, 115.5 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగువారి ఆత్మగౌరవ స్ఫూర్తి పేరుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పేదలకు భోజనం పెట్టేందుకు అన్న క్యాంటీన్లు పెడతామని బాబు వెల్లడించారు.