అందర్నీ మోసం చేసిన చంద్రబాబుది తుగ్లక్ పాలన: మంత్రి బొత్స
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (07:46 IST)
రాష్ట్రంలో దేవాలయాల వద్ద నిరసనలు తెలియచేయాలంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు పిలుపు ఇవ్వడాన్ని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు.
ఆలయాల్లో పూజలు చేయాలి...ఆలయం బయట నిరసనలు చేపట్టాలని చంద్రబాబు పిలుపునివ్వడం అత్యంత దారుణమని అన్నారు. పవిత్రమైన ఆలయాలు, హిందూ మతం పట్ల చంద్రబాబుకు వున్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. చివరికి దేవుడిని కూడా చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మంత్రి బొత్స ఫైర్ అయ్యారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
1)చంద్రబాబు హయాంలో విజయవాడలో పెద్ద ఎత్తున ఆలయాలను ధ్వంస చేశారు. పుష్కరాల సమయంలో చంద్రబాబు వల్ల 29 మంది దారుణంగా చనిపోయారు. దీనిపై సిబిఐ విచారణకు డిమాండ్ చేసినా చంద్రబాబు ఆనాడు అంగీకరించలేదు. ఇప్పుడు అంతర్వేది రథం దగ్ధం ఘటనలో సీఎం వైయస్ జగన్ చిత్తశుద్దితో చర్యలు తీసున్నారు.
అలక్ష్యం వహించిన ఆలయ సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. ఇంకా ప్రజల్లో వున్న అపోహలను తొలగించేందుకు సీబిఐ విచారణకు కూడా ఆదేశించారు. ఇదీ ఈ ప్రభుత్వంకు వున్న చిత్తశుద్ది.
2)చంద్రబాబుకు వంత పాడుతున్న పవన్ కళ్యాణ్ ఆనాడు ఆయన హయాంలో జరిగిన ఆలయాల ధ్వంసంపై ఎందుకు నోరుమెదపలేదు? ఆనాడు దళితులపై జరిగిన దాడులపై ఎందుకు మాట్లాడలేక పోయారు? అలాగే జాతీయ పార్టీ బిజెపి అంతర్వేది ఘటనపై రాద్ధాంతం చేస్తూ... మరో ప్రార్థనా మందిరంపై రాళ్ళు రువ్విన వారిని వదలిపెట్టాలంటూ ధర్నాలు చేస్తోంది. ఇదెక్కడి రాజకీయం. ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రతిపక్షాలకు అక్కరలేదా?
3)రాష్ట్రంలో అక్కడక్కడా జరుగుతున్న చెదురుమదురు సంఘటనల వల్ల శాంతిభద్రతలకు విఘాతం రాకూడదని సీఎం గారు పట్టుదలతో వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అంతర్వేది వద్ద జరిగిన రథం దగ్ధం ఘటనలో నిజంగా ప్రమాదంలో రథం కాలిపోయిందా? ఎవరైనా కావాలని కాల్చారా? ఇందులో కుట్రకోణం వుందా? అనే అనుమానంతో ఇప్పటికే ప్రభుత్వం సీబిఐ విచారణకు ఆదేశించింది.
జగన్ రాష్ట్ర డిజిపితోపాటు అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆధ్యాత్మిక కేంద్రాల వద్ద ఎటువంటి సంఘటనలు జరగడానికి వీలు లేదని ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా జరిగితే సంబంధింత పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులే బాధ్యత వహించాల్సి వుంటుందని అన్నారు.
4)తాను సీఎంగా వున్న సమయంలో ఈ రాష్ట్రంలోకి సీబిఐ రాకూడదని చట్టాలు చేసిన వ్యక్తి చంద్రబాబు. ఇది తప్పు అని ప్రతిపక్షంగా మేం ఆనాడు అభ్యంతరం చెప్పినా పట్టించుకోలేదు. అధికారం వుందని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. గత ప్రభుత్వాల మాదిరిగా, గత సీఎంల మాదిరిగా కుంటిసాకులు చెప్పి, బుల్డోజ్ చేస్తూ ప్రజలు, పార్టీలు ఏమనుకుంటే మాకేంటనే పద్దతిలో ఈ ప్రభుత్వం వ్యవహరించడం లేదు. బాధ్యత కలిగిన ప్రభుత్వంగా మేం వ్యవహరిస్తున్నాం.
5)చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు ఒకలా... తరువాత ఒకలా మాట్లాడుతున్నారు. ఆయన అధికారంలో వున్నప్పుడు దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అన్నారు. ఇప్పుడు దళితుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నాడు. చంద్రబాబు ఎప్పుడైనా దళితులపై జరిగిన దాడులపై పటిష్టమైన చర్యలు తీసుకున్నారా? ఏనాడైనా దళితులకు తన ప్రభుత్వంలో ఉన్నత స్థానం కల్పించారా? దళితులను తన రాజకీయ అవసరాల కోసం వాడుకున్న వ్యక్తి చంద్రబాబు.
6)నిన్న రాష్ట్రంలోనే మహిళా లోకానికి ఒక పండుగ. సుమారు 9 లక్షల పొదుపు సంఘాలకు దాదాపు రూ.27వేల కోట్లు వైయస్‌ఆర్ ఆసరా పథకం కింద ప్రభుత్వం ఇచ్చేందుకు సంకల్పించింది. దాదాపు 90 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు సుమారు. రూ.6800 కోట్లను సీఎం జగన్ గారు బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయించారు.
అక్కచెల్లెమ్మలకు ఒక అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా అండగా నిలిచారని మహిళా లోకం ఆయనను కొనియాడుతోంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడిగా, రాజకీయాలలో గొప్ప విలువలను తీసుకువచ్చిన నవశకం నేతగా వైయస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు. ఈ రాష్ట్రంలోని ప్రతిపక్షం ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిన నేపథ్యంలో వారికి వున్న నేరప్రవృత్తితో, దుర్మార్గపు ఆలోచనలతో దానికి ఆటంకాలు కలిగించాలని ప్రయత్నిస్తోంది.
7)అమరావతి రాజధానికి రెఫరెండం పెడదామని చంద్రబాబు చౌకబారు మాటలు మాట్లాడుతున్నాడు. అమరావతిలోని పేదల భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో... రైతులను, దళితులను మభ్యపెట్టి, వారి భూములను మోసపూరితంగా చంద్రబాబు, ఆయన అనుయాయులు కాజేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది.
తమ మంత్రులతోనే సబ్ కమిటీ వేశారని చంద్రబాబు విమర్శలు చేయడం అర్థరహితం. లేకపోతే దోపిడీ చేసిన తెలుగుదేశం వారితో సబ్ కమిటీ వేస్తారా? సిఆర్డీఏలో చంద్రబాబు, ఆయన అనుయాయులు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదు. అయిదేళ్ళు అధికారంలో వుండి కరకట్ట రోడ్‌ను కూడా నిర్మించలేకపోయిన చంద్రబాబుది తుగ్లక్ పాలన. ప్రజలకు మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ ముందుకు సాగుతున్న సీఎం శ్రీ వైయస్ జగన్ పాలన ప్రజారంజకం.