జగన్‌ను నాయకునిగా ఆ దేవుడే స్వయంగా ఎంపిక చేశాడు...
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (19:15 IST)
సమాజానికి సత్య సమాధానం, శాంతి సందేశం అందించిన సజీవ సాక్ష్యం ఏసుక్రీస్తు అని శాసనమండలి సభ్యులు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు లేళ్ళ అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే ఆయనను బట్టి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా కాలం పిలవబడి కొలవబడుతుందని ఆయన పేర్కొన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్(ఏఐసీసీ) ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దైవజనులు, పార్టీ నేతల సమక్షంలో లేళ్ళ అప్పిరెడ్డి క్రిస్మస్ కేక్ కట్ చేశారు.
అనంతరం అప్పిరెడ్డి మాట్లాడుతూ, పాపులను రక్షించేందుకు దేవుడే మానవుడిగా అవతరించిన శుభదినమే క్రిస్మస్ అని తెలిపారు. క్రీస్తు అరుదెంచిన నాటి నుంచే కొలవబడుతున్న మన కాలమానాలను బట్టే ఆయన చరిత్రకు ఎంత సజీవ సాక్ష్యమన్నది అర్ధం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రేమను కావాలనుకునేవారు, పంచాలనుకునేవారు, శాంతిని కోరుకునే వారు ఏసు ప్రభువును ఆరాధిస్తున్నట్లు చెప్పారు. ఆయన తన శాంతి సందేశాలను బైబిల్లోని వాక్యాల రూపంలో సమాజానికి అందించి వెళ్ళారన్నారు. అందుకే బైబిల్ వాక్యాలు విన్నా, చదివినా వారి జీవితాలకు శాశ్వత సౌఖ్యం లభిస్తుందని వివరించారు.
పాపులను రక్షించే క్రమంలో శత్రువులను సైతం ప్రేమించమన్న క్షమాగుణాన్ని సమాజానికి అందించిన క్రీస్తు పుట్టిన సందర్భంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలను కూడా తన స్వార్ధ రాజకీయాలకు వాడుకుంటున్న విపక్ష నేత వైఖరి పట్ల అప్పిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆనాడు ఏసు ప్రభువు ఏదైతే మాటల రూపంలో చెప్పారో... వాటిని ఆచరణలో చేసి చూపిస్తూ... ప్రజల జీవితాల్లో సమూల మార్పులు తెస్తున్న ముఖ్యమంత్రి జగన్‌పై విషం కక్కడం పట్ల ఆయన విస్మయం చెందారు. తాము ఆయనలా మాట్లాడలేమనీ... అందుకే దుష్టబుద్ధి గల ఆయన మనసు మార్చమని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నామనీ... తెలిపారు. అదే సమయంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వానికి సదా రక్షణ అందించాలనీ... కులామతాలకతీతంగా అందరి జీవితాల్లో ఈ క్రిస్మస్ సుఖసంతోషాలు నింపాలనీ... లేళ్ళ అప్పిరెడ్డి మనస్పూర్తిగా ఆకాంక్షించారు.
నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి మాట్లాడుతూ, పవిత్రుడైన ప్రభు ఏసు ఆశీర్వాదబలంతోనే వైయస్ కుటుంబం ఆది నుంచి ప్రజలకు తమ ప్రేమను, అభిమానాన్నీ పంచుతూనే ఉన్నారని తెలిపారు. ఎళ్ళవేళలా విశ్వాసుల పక్షానే నిలిచి వారికి స్వాంతన చేకూర్చే నిజమైన దేవుడు ఏసుక్రీస్తు అని పేర్కొన్నారు. ఏఐసీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు బిషప్ రెవరెండ్ డాక్టర్ జాన్ బెన్ని లింగం మాట్లాడుతూ, ప్రపంచంలోనే పాస్టర్లను గుర్తించి గౌరవించిన ఏకైక ప్రభుత్వం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వమేనని తెలిపారు. తరతమ తారతమ్యాలు లేకుండా అందరినీ ఆదరించమని చెప్పిన ఏసుక్రీస్తు మాటలను అక్షరాలా ఆచరించి చూపుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని ప్రశంసించారు.
వరల్డ్ ఇవాంజలిస్ట్ డాక్టర్ జాషువా సుధాకర్ మాట్లాడుతూ, సమాజానికి మేలు చేసే దైవిక లక్షణాలు గల వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఆనాడు, జగన్‌ను ఈనాడు నాయకునిగా ఆ దేవుడే స్వయంగా ఎంపిక చేశారని చెప్పారు. ఏఐసీసీ కార్యదర్శి ముత్యాల జయరాజు, ఏపీ, తెలంగాణ కోఆర్డినేటర్ సతీష్ ప్రార్ధన నిర్వహించగా... బిషప్ కొడాలి లాజర్ సర్వులకు దీవెనలు అందించారు. ఈ కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.