రాజ‌ధానిపై డ్రామాలొద్దు, పిఎం, అమిత్ షా డైరెక్ట్‌గా జ‌గ‌న్‌కి చెప్పాలి

మంగళవారం, 16 నవంబరు 2021 (13:09 IST)
అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా సిపిఐ గుంటూరు కలెక్టరేట్ వద్ద దీక్షలు చేస్తోంది. అమ‌రావ‌తి రైతుల‌కు ఈ సంద‌ర్భంగా మద్దతు తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, బీజేపీ నేత‌ల‌పై సూటిగా కామెంట్స్ చేశారు. 

 
అమరావతి రాజధాని కోసం ఇపుడు ఇది సుదీర్ఘ మైన పోరాటంగా మారింద‌ని, ఇంత వ‌ర‌కు దీనిపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేయలేద‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజధాని మార్పుపై విచారణ జరిపే హైకోర్టు బెంచ్ లో న్యాయమూర్తులను మార్చమనడం వైసీపీ ప్ర‌భుత్వ దిగజారుడుతనమేన‌ని ఆయ‌న విమ‌ర్శించారు. న్యాయ వ్యవస్థపై ప్రభుత్వానికి గౌరవం లేద‌ని, సిఎం జగన్ ప్రమాదకరమైన రాజకీయ క్రీడ ఆడిస్తున్నార‌ని రామ‌కృష్ణ ఆరోపించారు. 
 
 
ఉత్తరాంధ్ర, రాయలసీమలో పోటీ పాద యాత్రలకు వైసిపి నేతలు సిద్దమయ్యార‌ని, అధికారంలో ఉన్న వైసీపీ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతుంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ వైఖరిని సీపీఐ ఖండిస్తున్న‌ద‌ని చెప్పారు. బిజెపి నేతలు అమ‌రావ‌తి రైతుల పాద యాత్రలో పాల్గొనాలని అమిత్ షా చెప్పినట్లు వార్తలొచ్చాయ‌ని, ఇలాంటి డ్రామాలు మానుకోవాల‌ని ఆయ‌న బీజేపీకి హిత‌వు చెప్పారు. పిఎం, హోం మంత్రి రాజధాని మార్చవద్దని డైరెక్ట్ గా సిఎం జ‌గ‌న్ కి సలహా ఇవ్వాల‌ని, అప్పుడు మాత్రమే ప్రజలు బిజెపిని నమ్ముతార‌న్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు