ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈనెల 9 న జరిగే వేడుకలలో గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు, భూ పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని రాష్ట్ర గిరిజన సంక్షేమ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ సందర్భంగా విజయనగరంలో జరిగే ఆదివాసీ దినోత్సవ కార్య్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి హాజరు అవుతారని వివరించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారంగా ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పథకంలో భాగంగా అటవీ హక్కు పత్రాలు, ప్రభుత్వ భూములకు సంబంధించిన డికేటి పట్టాలను కూడా ఇవ్వాల్సి ఉందన్నారు.
అయితే కరోనా నేపథ్యంలో ఈ పట్టాల పంపిణీ వాయిదా వేశామని, అక్టోబర్ 2 న వాటిని గిరిజనులకు అందిస్తామని అధికారులు విపులీకరించారు. ఆరోజున మరింత ఎక్కువ మందికి పట్టాలను అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.