నల్గొండ జిల్లాలో 16 యేళ్ళ బాలికపై తండ్రీకుమారులు వరుసబెట్టి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆ బాలిక గర్భందాల్చడంతో రూ.5 వేలిచ్చి అబార్షన్ చేయించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. అయితే, అబార్షన్ చేయడం వీలుపడని వైద్యులు తేల్చి చెప్పడంతో ఈ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాంపల్లి మండలం తిరుమలగిరికి చెందిన 16 యేళ్ళ బాలిక కూలి పనులకు వెళుతూ తల్లిదండ్రులకు అండగా ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన భూతం శ్రీను, ఆయన కుమారుడు (15)లు కలిసి కొన్ని నెలలుగా వరుసగా అత్యాచారం చేస్తూ వచ్చారు.
ఈ క్రమంలో ఆ బాలిక కడుపునొప్పితో బాధపడుతూ వచ్చింది. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించగా గర్భందాల్చినట్టు తేలింది. దీంతో ఆ బాలికను నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. ఆ తర్వాత శ్రీనును సంప్రదిస్తే రూ.5 వేలు ఇచ్చి అబార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చాడు. అయితే, ఆ బాలికకు అబార్షన్ చేసేందుకు వైద్యులు నిరాకరించారు.
ఆ తర్వాత తన తల్లిదండ్రులతో కలిసి గ్రామానికి వచ్చి అత్యాచారానికి పాల్పడిన తండ్రీకొడుకును నిలదీసింది. తమకు ఎలాంటి సంబంధం లేదని, ఇష్టమొచ్చింది చేసుకోండని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బాలిక శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగింది. ఇది గమనించి బంధువులు హుటాహుటిన ఆమెను నల్గొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.