తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఏపీలోని చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలను ఈ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఈ కుండపోత వర్షాల దెబ్బకు భారీ వరదలే సంభవించాయి.
చనిపోయిన వారిలో చెంగల్ రెడ్డి, మల్లయ్య, చెన్నకేశవులు, శంకరమ్మ, ఆదెమ్మ, పద్మావతమ్మ, భారతి, మహాలక్ష్మి, మల్లయ్య, వెంకటరాజుతో సహా 11 మందిని గుర్తించారు. అలాగే, సిద్ధవటం మండలం వెలుగుపల్లెల గ్రామంలో వరద నీటి ఉధృతికి మరో ఐదుగురు గల్లంతయ్యారు.
ఇదిలావుంటే, కడప జిల్లా చెయ్యేరు నది నీటి ప్రవాహంలో రెండు ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. వీటిలో ఒక పల్లె వెలుగు బస్సు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఈ బస్సులో ఉన్న కండక్టర్ అహోబిలంతో పాటు.. మరో నలుగురు ప్రయాణికులు చనిపోయారు. మిగిలిన ప్రయాణికుల్లో ముగ్గురు చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకోగా, మరో ఆగుగురు ఆచూకీ తెలియరాలేదు.