ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. పవన్ అడ్రెస్ గల్లంతు.. మంత్రుల ఓటమి

గురువారం, 23 మే 2019 (10:54 IST)
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీకి నిరాశే మిగిలింది. జనసేన అభ్యర్థులు గెలవడం పక్కనపెడితే ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అడ్రస్సే ఈ ఎన్నికల ఫలితాల్లో గల్లంతయ్యింది.


ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల ప్రకారం పవన్ కల్యాణ్ భీమవరంలో రెండో స్థానంలో కొనసాగుతుండగా, గాజువాకలో మూడోస్థానంలో కొనసాగుతున్నారు. ఇకపోతే, రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్‌ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు సమాచారం.
 
ఇకపోతే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఎవరూ ఊహించని అనూహ్యమైన తీర్పిచ్చారు. తమకు 120 నుంచి 130 సీట్లు వస్తాయని ముందునుంచి వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రస్తుత ట్రెండ్స్ కనీసం 145 సీట్లలో వైసీపీ ఆధిపత్యాన్ని చూపుతున్నాయి. ఇక తెలుగుదేశం ప్రభుత్వంలోని ఎంతో మంది మంత్రులు ఓటమి దిశగా పయనిస్తున్నారు మంత్రులు నారాయణ, అఖిలప్రియ, గంటా, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి తదితరులు వెనుకంజలో ఉన్నారు. 
 
మంగళగిరి నుంచి పోటీ పడిన నారా లోకేశ్, తొలి రౌండ్‌లో స్వల్ప ఆధిక్యాన్ని చూపించినప్పటికీ, ఆపై వెనుకబడిపోయారు. ఇక్కడ మూడో రౌండ్ ముగిసేసరికి ఆళ్ల రామకృష్ణారెడ్డి దూసుకొచ్చారు. ఈ ఫలితాలతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సందడి మాయమైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు