నగదు - స్వీట్ బాక్సుల పంపిణీకి వైకాపా శ్రీకారం... ఒక్కొక్కరికి రూ.5 వేలు నగదు

వరుణ్

మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (09:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలని అధికార వైకాపా గట్టి ప్రయత్నం చేస్తుంది. ఇందులోభాగంగా, ఓటర్లకు భారీ మొత్తంలో డబ్బులు పంపిణీ చేసి వారి ఓట్లను సంపాదించుకోవాలని భావిస్తుంది. ఇందులోభాగంగా, ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అపుడే డబ్బు పంపిణీకి తెరలేపారు. ఈయనను ఇటీవల మార్కాపురం సమన్వయకర్తగా నియమించారు. దీంతో సోమవారం ఆయన తన కార్యాచరణను ప్రారంభించారు. సోమవారం ఆయన దేవరాజుగట్టు సమీపంలోని తన ఇంజనీరింగ్ కాలేజీలో మార్కాపురం పట్టణంలోని వాలంటీర్లతో సమావేశమయ్యారు. ఒక్కొక్కరికి రూ.5 వేలు నగదు, స్వీట్ బాక్స్ అందజేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని, ఒక్కో వాలంటీర్ తమ పరిధిలోని 50 కుటుంబాలను కలిసి వైకాపా ఓట్లు వేయించేలా కృషి చేయాలని కోరారు. శనివారం తర్లుపాడు, మార్కాపురం రూరల్ మండలాలకు చెందిన వాలంటీర్లతోనూ ఆయన సమావేశమై నగదు, స్వీటు బాక్సులు పంపిణీ చేశారు. 
 
కాగా, గతంలో బేస్తవారపేట మండలం శింగరపల్లికి చెందిన జనసేన కార్యకర్తలు తమ గ్రామంలో రోడ్లు, మురుగు కాలువలు వేయాలంటూ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వాహనాన్ని 2021 జనవరి 15న అడ్డుకున్నారు. కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే.. 'మీరు ఎన్నికల్లో డబ్బులు తీసుకొని ఓట్లేశారు. జనసేన కండువాలు కప్పుకొని సమస్యలపై ప్రశ్నిస్తామంటే కుదరదు. కండువాలు తీసేసి రండి' అని దూషించారు.
 
తర్వాత ఆనాడు ప్రశ్నించిన కార్యకర్తల్లో ఒకరైన వెంగయ్యనాయుడి ఇంటికి వైకాపా శ్రేణులు వెళ్లి బెదిరించాయి. మనస్తాపానికి గురైన వెంగయ్యనాయుడు జనవరి 18న ఆత్మహత్య చేసుకున్నారు. డబ్బులు తీసుకుని ఓట్లు వేసిన వారికి ప్రశ్నించే హక్కు ఉండదని సూక్తులు వల్లించిన అన్నా రాంబాబు.. నేడు ఎన్నికల ముంగిట వాలంటీర్లకు డబ్బు కవర్లు, స్వీటు బాక్సులు పంచడం దేనికి సంకేతం? ఒకవేళ తాను గెలిచినా, ప్రశ్నించే హక్కును కోల్పోతారని చెప్పకనే చెప్పారని పలువురు స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు