దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల్లో తెరాస అధినేత కేసీఆర్ దూకుడుగా ముందుకెళుతున్నారు. అటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు.. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తూ, తనకు తిరుగులేదని నిరూపిస్తున్నారు.
అలా ముందుకు దూసుకెళుతున్న కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు నోటీసులు జారీ చేసింది. 2018లో నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ పిటిషన్ దాఖలైంది. గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలిచిన కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్ దాఖలైంది.
ఆయనపై 64 క్రిమినల్ కేసులు ఉంటే మొదటి అఫిడవిట్‌లో కేవలం 4 కేసులు మాత్రమే చూపారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... సీఎం కేసీఆర్, ఎన్నికల కమిషన్ సహా 14 మందికి నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో గనుక కేసీఆర్‌కు వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం ఆయన సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.