మహిళా డీఎస్పీ అనుమతి లేకుండా ఫొటో తీసి అమానుషంగా ప్రవర్తించిన హోంగార్డును పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర సీఐడీ విభాగంలో మెదక్ జిల్లా రీజినల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మహిళా డీఎస్పీని హోంగార్డు తన సెల్ ఫోన్‌తో ఫొటోలు తీశాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు డీఎస్పీ.. హోంగార్డు సెల్‌ఫోన్ తీసుకుని చూశారు. దీంతో కోపం కట్టలు తెంచుకున్నఆఫీసరు ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
పూర్తి వివరాలను పరిశీలిస్తే.. రెండ్రోజుల క్రితం సమావేశం కోసం డీఎస్పీ హైదరాబాద్ ఆఫీస్‌కు వచ్చారు. ఇదే సమయంలో సీఐడీ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ హోంగార్డు తన సెల్‌ఫోన్‌లో డీఎస్పీ ఫొటోలు తీశాడు. ఇది గమనించిన మహిళా డీఎస్పీ తన అనుమతి లేకుండా ఫొటో తీసి అసభ్యకరంగా ప్రవర్తించాడని సీఐడీ పోలీసు స్టేషన్‌లోనే ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హోంగార్డును అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసు కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో అధికారులు తీవ్రంగా చర్యలు చేపట్టారు. అధికారులను ఈ వ్యవహారంపై ఆరాతీయగా, హోంగార్డును అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్టు తెలిపారు. హోంగార్డు తీసిన ఫొటోలను పరిశీలించి, అవి ఉద్దేశపూర్వకంగానే తీసినట్లు అధికారులు తెలిపారు. వెంటనే అతడిని సస్పెండ్ చేయడంతో పాటు.. సీఐడీలో ఐపీసీ 509, 354డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.