రాజకీయాల్లో ఒకసారి వ్యక్తిగత ద్వేషాలు మొదలైన తర్వాత ఇరుపక్షాల నేతల, కార్యకర్తల మాటల్లో, అభిప్రాయ వ్యక్తీకరణలో సమతుల్యత లోపిస్తుందనడానికి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే నిలువెత్తు ఉదాహరణ. విశాఖ ఆర్కే బీచ్లో ప్రత్యేక హోదా ర్యాలీని అడ్డుకున్న తర్వాత ప్రభుత్వ, ప్రతిపక్ష నేతల ప్రకటనలలో రాజకీయ విమర్శల కంటే నేతలు, వారి కుటుంబాలు, వాళ్ల రోగాలపై వ్యాఖ్యలు చేయడం బాగా ముదిరిపోతున్నట్లుంది. మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులు కూడా కట్టుతప్పి వ్యక్తిగత దూషణలకు దిగుతుండటంతో ఈ జాఢ్యం కింది స్థాయి నేతల వరకూ అలవోకగా పాకిపోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం మొత్తంగా మానసిక రోగంతో బాధపడుతున్నారని వైఎస్సార్సీపీ నేత వ్యాఖ్యానించడం రాజకీయ పరిశీలకులను కలవరపెడుతోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసిక రోగంతో బాధపడుతున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. శనివారం విజయవాడలో జోగి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారని, ప్రత్యేక హోదా విషయంలో ఆయన రోజుకో మాట మాట్లాడుతుండటమే దీనికి నిదర్శనమని విమర్శించారు. చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడికి, బావమరిది నందమూరి బాలకృష్ణకు కూడా ఈ వ్యాధి ఉందని అన్నారు.
వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ పోరాడుతుంటే మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రులు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు, నారాయణ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. చంద్రబాబు చెప్పిందే చెబుతూ మానసిక క్షోభకు గురవుతున్నారని, ఆయన తీరుతో మంత్రులు, కలెక్టర్లు విసిగిపోతున్నారని జోగి రమేష్ అన్నారు.