ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కేంద్రంగా పాలన ప్రారంభమైందని, హైదరాబాద్‌లోని ఉద్యోగులంతా అక్కడికి తరలి వెళ్లారని, అందువల్ల ఇక హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని అని అనొద్దంటూ కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాయనున్నారు.
పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా చూపించాల్సిన అవసరం లేదని, నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా, తెలంగాణకు మాత్రమే హైదరాబాద్‌ను రాజధానిగా పేర్కొంటూ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం కోరనున్నట్టు సమాచారం. ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చిన విషయాన్ని లేఖలో ప్రస్తావించింది.
కాగా, చట్టంలోనే 'ఉమ్మడి రాజధాని' అన్న పదాన్ని పేర్కొన్నందున, కేవలం హోం శాఖ నిర్ణయం మాత్రమే సరిపోదని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చట్ట సవరణ చేయాల్సి వుందని, దానికి రెండు రాష్ట్రాల శాసనసభల ఆమోదం తప్పనిసరని, ఏపీ ప్రభుత్వం అంగీకరించకుండా కేంద్రం నిర్ణయం తీసుకోలేదని అధికారులు అంటున్నారు.