పోలవరం 'చంద్రవరం'... కోనసీమలా రాయలసీమ... సీఎం బాబుపై కేఈ పొగడ్తల వర్షం
గురువారం, 25 మే 2017 (20:45 IST)
పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి చంద్రవరం అన్నారు డిప్యూటీ సి.ఎం కే.ఈ క్రిష్ణమూర్తి. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితోనే పోలవరం ప్రాజెక్టు సాకారమైందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ప్రభుత్వం చేపడుతున్ననీటి సంరక్షణా చర్యల వల్ల రాయలసీమ త్వరలోనే మరో కోనసీమగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ఉపముఖ్యమంత్రి ప్రసంగించారు. కొత్తగా జిల్లా కలెక్టర్ల భాధ్యతలు చేపట్టిన వారందరికీ అభినంధనలు తెలియజేశారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రి యువతకు ప్రాధాన్యతను ఇచ్చారని, ఇది ఎంతో శుభ పరిణామమన్నారు.
రాజధాని నిర్మాణానికి తొలి అడుగులు పడ్డాయని మొత్తం 900 ఎకరాల్లో పరిపాలన నగరం రూపొందుతోందన్నారు. నభూతొ న భవిష్యతి అన్న రీతిలో మన రాజధాని ప్రపంచ దేశాల రాజధానులకి మించి నిర్మాణమవుతుందన్నారు. ఏ రాష్ట్రానికైనా రాజధానే ఆయువుపట్టని, ఎంత విస్తృతంగా దీన్ని అభివృద్ధి పరచగలిగితే అంతగా విదేశీపెట్టుబడులను ఆకర్షించవచ్చన్నారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటన విజయవంతమయిందని, 15 నగరాలలో పర్యటించి, 90కి పైగా కంపెనీల ప్రముఖులను, ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో విజయం సాధించారని, దీనికి ముఖ్యమంత్రిని మనమంతా అభినందించాలన్నారు.
కోస్టల్ కారిడార్, భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం, మచిలీపట్నం పోర్టు అభివృధ్ది, కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో మిమానాశ్రయ నిర్మాణం ద్వారా రాష్ట్ర స్వరూపం మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని, ప్రతీ జిల్లాలో లభ్యమయ్యే వనరులను ఆధారంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ భూములను APIIC కి ఉచితంగా ఇవ్వడం, NALA ఛార్జీలు తగ్గించడం వల్ల ఔత్సహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఏర్పాటుకి ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా ఉపయోగకరమైన మూడు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు. అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇళ్ళ నిర్మాణం చేసుకున్న స్థలాల క్రమబద్దీకరణ మరియు మాజీ సైనికోద్యోగులు, స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన భూములు 10 సంవత్సరాల తరువాత విక్రయించుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసామన్నారు. ఈ సంస్కరణలను ఫలాలను ప్రజలకు సమర్థవంతంగా అందించడంలో జిల్లా కలెక్టర్లు సమర్ధవంతంగా వ్యవహరించాలన్నారు. మంత్రులగా ప్రతి నెలవారి కార్యక్రమాల వివరాలు ముఖ్యమంత్రి సమీక్ష కోసం పంపుతున్నాము.
పంట సంజీవని, నీరు- చెట్టు, చెక్ డాంల నిర్మాణాల వల్ల ఒక్క కర్నూలు జిల్లాలోనే భూగర్భ జలాలు ఎన్నడూ లేనంతగా 3.5 మీటర్ల పెరిగాయని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా త్రాగునీరు, సాగునీరు కొరత తీరుతుందన్నారు. క్రిష్ణా, గోదావరి నదుల అనుసంధానం ద్వరా డెల్టా ప్రాంతానికి నీరందించి, మిగులు జలాలను HNSS ద్వారా రాయలసీమకు సాగునీరు, త్రాగునీరిచ్చి, రాళ్ళ సీమను రతనాల సీమగా మార్చడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
గత 35 నెలల కాలంలో రాష్ట్రాభివృద్ధి కోసం చేపట్టిన అనేక అభివృద్ది కార్యక్రమాలు కలెక్టర్ల సహకారంతో కార్యరూపం దాలుస్తున్నాయన్నారు. 7 మిషన్లు, 5 గ్రిడ్లను ఆయుధాలుగా మలుచుకొని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తుంటే, రాష్ట్ర అభివృద్దికి ప్రతిపక్షం అవాంతరాలు కల్పిస్తుందన్నారు. అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా జరుగుతాయని ఆశించాం, ప్రతిపక్ష పార్టీ దిగజారుడు ధోరణివల్ల ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం లేకుండా పోయిందన్నారు.