కృష్ణా పుష్కరాలకు కేవలం 3 నెలలు... హర్రీయప్, కృష్ణకు నీరు వస్తుందా...?
శనివారం, 14 మే 2016 (14:27 IST)
కృష్ణా పుష్కరాలు ముంచుకొస్తున్నాయని అధికారులు హడావుడి పడుతున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలి పుష్కరాలకు మంచి ఏర్పాట్లు చేయాలని తపన పడుతున్నారు. ముఖ్యంగా కృష్ణా నదిలో స్నానం చేసే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా, నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ అహ్మద్ బాబు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా నదీ తీరంలో దుర్గా ఘాట్, పున్నమి ఘాట్, పవిత్ర సంగమం ఘాట్లను పునర్నిర్మిస్తున్నారు.
ఈ పనులను ఒక చైనా కంపెనీతోపాటు, ఇతర కాంట్రాక్టర్లకు అప్పగించారు. పుష్కర ఘాట్ల నిర్మాణాలను కలెక్టర్ అహ్మద్ బాబు పరిశీలించారు. పనులు ముమ్మరం చేయాలని, సమయం కేవలం 90 రోజులు మాత్రమే ఉందని కలెక్టర్ చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన పగలు రాత్రి పనులు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు ప్రకాశం బ్యారేజీ ఎప్పుడూ నీళ్ళతో కళకళలాడాల్సింది కానీ, ఇపుడు ఆ పరిస్థితి లేదు... ప్రకాశం బ్యారేజిలో నీరు అడుగంటింది. కేవలం 4.2 అడుగుల నీటి మట్టానికి చేరింది. ఇన్ ఫ్లో...అవుట్ ఫ్లో కాలువలు అన్నీ బంద్ అయ్యాయి. గత 50 ఏళ్ళ ప్రకాశం బ్యారేజి చరిత్రలో ఇంతటి నీటి కరవు ఇదే ప్రథమం. ప్రకాశం బ్యారేజిలో ఇపుడు కేవలం 4.2 అడుగుల నీటి మట్టం ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 11.9 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, దాదాపు కృష్ణా నది ఎండిపోయిట్లే.
గత 50 ఏళ్ళ ప్రకాశం బ్యారేజి చరిత్రలో నీటి కరవు ఇదే ప్రథమం. నాగార్జున సాగర్‌లో 506.9 అడుగుల నీటి మట్టం ఉంది. ఇక్కడ పూర్తిగా ఎడారి వాతావరణం నెలకొనడంతో, తాగునీటి కోసం సాగర్ నుంచి ఏపీకి 6 టిఎంసీలు, హైదరాబాదుకు 3 టిఎంసీల నీరివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడ నుంచి నీరు వస్తే తప్పించి, ఇక్కడ తాగునీటి అవసరాలు గడవని పరిస్థితి.
గుంటూరు ఛానల్‌కు నీరు విజయవాడలోని ప్రకాశం బ్యారేజి నుంచే వెళుతుంది. కానీ, ఇపుడు ఆ కాలువ కూడా బంద్ చేశారు. ఇపుడు ఎండలు మండిపోతున్నాయి. గొంతులు ఎండిపోతున్నాయి. వర్షాలు ఈసారి ముందే వస్తాయని, రుతుపవనాలు ముందే పలకరిస్తాయని అన్నారు. కానీ, తాజాగా వాతావరణ శాస్త్రవేత్తలు ఇక జూన్ మొదటి వారం వరకూ రుతు పవనాలు వచ్చే ఆశ లేదని చెపుతున్నారు. అవి కేరళను ఎపుడు తాకుతాయో, ఎప్పుడు తెలుగు రాష్ట్రాలకు చేరుతాయో తెలియని ఆయోమయ పరిస్థితి. అందుకే ముందు చూపుతో పర్యావరణాన్ని పరిరక్షించడం, ఇంకుడు గుంతలతో భూగర్భ జాలాలను సంరక్షించుకోవడం ఇపుడు తప్పనిపరిస్థితి. లేదంటే, డెల్టా కూడా ఎడారిగా మారే ప్రమాదం ఉంది.