ఎక్కడికీ పారిపోలేదు.. ఇంట్లోనే ఉన్నా.. పోలీసులకు బాగా సహకరించా : నటి కస్తూరి

ఠాగూర్

సోమవారం, 18 నవంబరు 2024 (09:53 IST)
అరెస్టుకు భయపడి తాను పారిపోయినట్టు మీడియా, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై సినీ నటి కస్తూరి వివరణ ఇచ్చారు. ఆమెను చెన్నై ఎగ్మోర్ పోలీసులు అదుపులోకి తీసుకోకముందే ఒక వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియోను ఆదివారం రాత్రి విడుదల చేశారు. ఇందులో తానెక్కిడికీ పారిపోలేదని చెప్పారు. ఎలాంటి భయం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని తన ఇంట్లోనే ఉన్నానని, షూటింగ్ కోసమే హైదరాబాద్ వచ్చానని పేర్కొన్నారు. రోజూ షూటింగుకు వెళ్ళి వస్తున్నానని తన మొబైల్ ఫోన్‌ను న్యాయవాదికి ఇచ్చానని, పోలీసులకు పూర్తిగాసహకరిస్తానని, ఇపుడు కూడా ఎగ్మోర్ పోలీసులతో తనకు తానుగా వెళుతున్నట్టు నటి కస్తూరి ఆ వీడియోలో పేర్కొన్నారు. 
 
కాగా, ఈ నెల 3వ తేదీన చెన్నై ఎగ్మోర్‌లో జరిగిన ఓ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న నటి కస్తూరి ప్రసంగిస్తూ, తెలుగు ప్రజలను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజుల కాలంలో అంతఃపురాల్లో ఉండే మహిళలకు సేవ చేయడానికి వచ్చినవారే తెలుగు ప్రజలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిపై చెన్నైలోని తెలుగు సంఘాలతో పాటు తెలుగు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై చెన్నై, మదురైలలో కేసులు నమోదయ్యాయి. 
 
అదేసమయంలో ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తూ, నటి కస్తూరి న్యాయ విచారణ ఎదుర్కోవాల్సిందేనంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె అరెస్టు కోసం పోలీసులు ప్రయత్నించగా, చెన్నైను వీడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆమె చెన్నైలో ఉన్నట్టు తెలియడంతో పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు. ఆదివారం చెన్నై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి చెన్నై పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు