రాజకీయాలకు దూరమని చెప్పా.. దానికి కట్టుబడి ఉన్నా : లగడపాటి

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (09:51 IST)
రాజకీయాలకు దూరమని గతంలోనే చెప్పానని దానికి కట్టుబడి ఉన్నానని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. ఆయన మంగళవారం అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. 
 
ఆ తర్వాత లగడపాటి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్రాలు సఖ్యతతో మెలగడం శుభపరిణామమన్నారు. తాను వ్య‌క్తిగ‌తంగానే చంద్ర‌బాబుని క‌లిశాన‌ని, చంద్రబాబుతో నంద్యాల సహా ఏ రాజకీయ అంశం గురించి మాట్లాడలేదని లగడపాటి అన్నారు. 
 
తాను రాజ‌కీయాల‌కి దూరంగా ఉంటాన‌ని గ‌తంలోనే స్ప‌ష్టం చేశాన‌ని, ఇప్ప‌టికీ అదే మాట‌పై నిల‌బ‌డి ఉన్నాన‌ని అన్నారు. కాగా, ఇటీవలి కాలంలో సీఎం చంద్రబాబుతో లగడపాటి టచ్‌లో ఉంటున్న విషయం తెల్సిందే. దీంతో ఆయన టీడీపీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. వీటికి లగడపాటి తెరదించారు. 

వెబ్దునియా పై చదవండి