అందం కోసం వెళితే అంద విహీనంగా మార్చేశారు...

శుక్రవారం, 3 మే 2019 (09:25 IST)
ఇటీవలికాలంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత అందంపై శ్రద్ధ చూపించడం ఎక్కువై పోతోంది. ముఖ్యంగా యువత మాత్రమే కాకుండా వయసు మళ్ళిన వృద్ధులు కూడా అందం కోసం పరితపిస్తున్నారు. అందరిలా తాము కూడా అందంగా ఉండాలని ఆరాటపడుతున్నారు. ఇందుకోసం వారు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
ఇదేవిధంగా ఆశపడి అందంగా కనిపించాలనకున్న ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వెస్ట్ గోదావరి జిల్లాలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, భీమవరానికి చెందిన శివ అనే యువకుడు మరింత అందంగా కనిపించాలని భావించాడు. ఇందుకోసం తన రూపాన్ని మరింత తీర్చిదిద్దుకోవాలని ఆశపడ్డాడు. ఈ యువకుడు మెకానిక్‌ కావడంతో తమ షాపుకు వచ్చే వివిధ రకాల మోడల్ బైకులతో ఫోజులు దిగుతూ తనను తాను హీరోగా పోల్చుకునేవాడు. 
 
అయితే, తాజాగా మెకానిక్ షెడ్డులో జరిగిన ఓ చిన్నపాటి అగ్నిప్రమాదంలో అతని ముఖానికి చిన్నగాయమైంది. అంటే ముఖంపై చిన్నపాటి మచ్చలు ఏర్పడ్డాయి. దీంతో వాటిని తొలగించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని భావించాడు. భీమవరంలోని న్యూ లండన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఆశ్రయించాడు. తనకు ప్లాస్టిక్ సర్జరీ చేసి... మొహంపై ఉన్న మచ్చలు పోయేలా చూడాలని వైద్యులను సంప్రదించాడు. దీంతో వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని, ఇందుకోసం రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతాయని చెప్పారు. 
 
దీంతో తనకు అందిన చోటల్లా అప్పులు చేసి... వైద్య ఖర్చులు చెల్లించాడు. చికిత్సలో భాగంగా డాక్టర్లు ముందుగా మొహంలో ఒకవైపు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. మూడు నెలల తర్వాత రెండోవైపు శస్త్రచికిత్స చేశారు. ముందుసారి ఫర్లేదు కానీ, రెండోసారి సర్జరీ చేసేటప్పుడు మత్తు ఎక్కువ ఇవ్వడంతో వికటించింది. దీంతో మొహంలో మార్పులు మొదలయ్యాయి. రోజురోజుకీ పరిస్థితి మరింత దిగజారి శివ రూపం వికృతంగా మారిపోయింది. గతంలో కంటే అందవిహీనంగా తయారయ్యాడు. చూసేందుకేకాకుండా మానసికంగానూ ప్రవర్తనలో తేడాలు వచ్చాయి. 
 
రోజురోజుకీ మతిస్థిమితం లేకుండా పోతోందని తల్లి గమనించింది. వెంటనే ఆస్పత్రి వైద్యులను సంప్రదించాడు. అయితే డాక్టర్లు తమకెలాంటి సంబంధం లేదంటూ తేల్చేసి.. శివతో పాటు అతడి తల్లిని బయటకు గెంటేశారు. వేరే ఆసుపత్రులకు తిరిగినా ప్రయోజనం లేదు. దీంతో బాధితులు భీమవరం పోలీసులను ఆశ్రయించింది. న్యూ లండన్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ద్వారా నష్టపోయమాని తమకు న్యాయం చేయాలని కోరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు