సీఎం జగన్‌తో మంత్రి పేర్ని నాని భేటీ.. రేపు చిరుతో సమావేశం

బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (19:17 IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు. సినిమా టికెట్ల ధరల పెంపు, థియేటర్ సమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వం నియమించిన కమిటీ చేసిన అధ్యయనంపై సీఎంకు నాని వివరించారు. 
 
గురువారం మధ్యాహ్నం సీఎం జగన్‌తో చిరంజీవి సహా ఇతర సినిమా పెద్దల భేటీ వున్న నేపథ్యంలో జగన్‌తో పేర్ని నాని భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
బుధవారం విశాఖ పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్న సీఎం జగన్ వెంటనే పేర్నినానితో సమావేశమయ్యారు. గురువారం సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సీఎంతో చర్చిస్తున్నారు మంత్రి పేర్ని నాని. 
 
సినిమా టికెట్ల ధరల పెంపు, సినిమా పరిశ్రమకు ప్రయోజనాలు కల్పించే అంశాలపై చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక, టికెట్ల ధరల పెంపు అంశంపై రేపు హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఏం చెప్పాలనే అంశంపై జగన్‌ మంత్రి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. 
 
కాగా.. ఈ నెల 10న సీఎం జగన్‌తో చిరంజీవి సహా ఇతర సినీ ప్రముఖుల సమావేశం వున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక దాదాపు సిద్ధమైంది. ఈ క్రమంలోనే సినిమా ప్రముఖులతో భేటీలో వారి అభిప్రాయాలు తీసుకుని చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. అలాగే సినిమా ధియేటర్ల యజమానుల సమస్య పరిష్కారంపైన చర్చ జరిగే అవకాశాలున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు