పట్టణాల్లో కరోనా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి: నీలం సాహ్ని
ఆదివారం, 7 జూన్ 2020 (10:16 IST)
దేశ వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రంలోను నమోదవుతున్న కరోనా కేసుల్లో 70శాతం వరకూ కేసులు పట్టణ ప్రాంతాల్లోనే ఉంటున్నాయని ఈ నేపధ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు పట్టణాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు.
పట్టణ ప్రాంతాల్లో కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆమె జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఇతర వైద్యాధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ వైరస్ వ్యాప్తి నియంత్రణకు పట్టణాల్లోని ప్రైమరీ,సెకండరీ సర్వెలెన్స్ అండ్ మానిటరింగ్ బృందాలు సమర్ధ వంతంగా పనిచేసేలా చూడాలని ఆదేశించారు.ప్రతి వార్డు సచివాలయాన్ని ఒక పట్టణ ఆరోగ్య కేంద్రంతో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు.
ఒక వేళ చిన్న మున్సిపాలిటీలై ఒకటికంటే ఎక్కువ పట్టణ ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో లేకుంటే దగ్గర లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంతో అవార్డు సచివాలయాన్ని అనుసంధానించాలని సిఎస్ స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, దేవాలయాలు, హోటళ్ళు తదితర ప్రాంతాల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం,ఆరోగ్య సేతు యాప్‌ను వినియోగించడం తప్పనిసరి చేయాలని కలెక్టర్లు,మున్సిపల్ కమీషనర్లను సిఎస్ ఆదేశించారు.
రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న అర్బన్ హెల్త్ కేంద్రాలను రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని సిఎస్ నీలం సాహ్ని పేర్కొన్నారు. కొత్త అర్బన్ హెల్త్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చే లోగా అన్ని ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అన్నారు.
పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో మెప్మా స్వయం సహాయక సంఘాలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని సిఎస్ నీలం సాహ్ని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కరోనా మరణాలు సంభవించకుండా హైరిస్క్ వ్యక్తులను గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందించి చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.
ప్రతి అర్బన్ హెల్త్ కేంద్రం పరిధిలో ఓట్ రీచ్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు వ్యాధి లక్షణాలున్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టెస్టులు చేయించుకునేలా ప్రోత్సహించాలని చెప్పారు. కరోనా టెస్టులు ఎక్కడ చేస్తున్నారు, వైద్య సేవలకై ఏ ఆసుపత్రులకు వెళ్ళాలనే దానిపై పూర్తి అవగాహన కలిగించాలన్నారు.
ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తోపాటు భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని స్పష్టం చేశారు.పట్టణాల్లో కరోనా నియంత్రణకు పట్టణ ఆరోగ్య ఆరోగ్య కేంద్రాలను అన్నివిధాలా మెరుగైన రీతిలో పనిచేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు, కర్నూలు వంటి ముఖ్య నగరాల్లో నే అధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నందున ఆయా పట్టణాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఇందుకుగాను యాక్టివ్ సర్వేలెన్స్ చర్యలు చేపట్టడం, కాంటాక్ట్ ట్రేసింగ్,బయటి నుండి వస్తున్న వ్యక్తుల గురించి నిరంతరం పర్యవేక్షించడం వంటి చర్యలు తీసుకోవాలని అన్నారు.ఆలాగే హోం క్వారంటైన్, హోం ఐసోలేషన్ సక్రమంగా పాటిస్తుందీ లేందీ నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు.వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.అంతేగాక మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని చెప్పారు.
దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు టివిలు,పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం తోపాటు పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా పెద్ద ఎత్తున అనౌన్స్ మెంట్ చేయాలని చెప్పారు.అలాగే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల భాగ స్వామ్యంతో అవగాహన కల్పించాలని చెప్పారు.
మున్సిపల్ పరిపాలన శాఖ కమీషనర్ మరియు డైరెక్టర్ జిఎస్ఆర్కే విజయకుమార్ మాట్లాడుతూ ప్రతి అర్బన్ వార్డు సచివాలయాన్ని పట్టణ ఆరోగ్య కేంద్రంతో మ్యాపింగ్ చేయాలని ఆవిధంగా చేసిన వివరాలన్నీ సోమవారం లోగా ఇవ్వాలని మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు.
వీడియో సమావేశంలో అదనపు డిఎం రాంప్రసాద్, డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ డా.అరుణకుమారి, ఎపివిపి కమీషనర్ రామకృష్ణారావు, స్టేట్ నోడల్ అధికారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.