విజయవాడ : పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరు ఇస్తామని ప్రచారం చేసిన చంద్రబాబు... ఇంకా కృష్ణా డెల్టాకే పూర్తిగా నీరు ఇవ్వలేదని వైసీపీ నేత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామాచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. పట్టిసీమ ద్వారా చంద్రబాబు వందల కోట్లు ప్రజాధనం లూటీ చేసారని ఆరోపించారు. పట్టిసీమ దోపిడీని మరువక ముందే మరో ఎత్తిపోతల ప్రాజెక్టు పేరుతోదోపిడీకి తెర తీసారని, 900 కోట్ల ప్రాజెక్టు ని..1638 కోట్లకు పెంచుతూ జి.ఓ ఇచ్చారని ఆరోపించారు.
రాజధాని నిర్మాణం అంటూ ఆర్భాటం చేసి ఆ ప్రాంతాన్ని గాలికి వదిలేసారని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రైతుల నుండి వేల ఎకరాల భూములు లాక్కున్నారని పేర్కొన్నారు. నల్లధనంపై చంద్రబాబు మాట్లాడటం హాస్యస్పదమని, చంద్రబాబుకి ధైర్యం వుంటే నల్లధనం 10 వేల కోట్లు జగన్‌వి అని నిరూపించాలన్నారు. నిరూపించకపొతే జగన్‌కి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.
చంద్రబాబు చేసిన తప్పులు అన్నీ జగన్ పై నెట్టడం సరికాదని, ఎన్నికల్లో డబ్బులు ఇచ్చే సంస్కృతి చంద్రబాబుదేనని ఆరోపించారు. ఎన్టీఆర్ పేదల కోసం పార్టీ పెడితే..చంద్రబాబు ధనవంతుల పార్టీగా మార్చేశాడని, చంద్రబాబు అవినీతి రారాజు..డబ్బు లేకుండా ఏ పని చెయ్యడన్నారు. టీడీపీ లోకి వెళ్లిన తమ ఎమ్మెల్యేలు మళ్ళీ వైసీపీ కి వస్తామని అడుగుతున్నారని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పారు.