గ్రామ సచివాలయాల్లో మహిళా కార్యదర్శులను పోలీసులుగా నియమించడంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసు శాఖలో మహిళా పోలీసులుగా పరిగణిస్తూ ప్రభుత్వం జీవో 59ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
రెవెన్యూ శాఖలో 15 వేల మందిని మహిళా కార్యదర్శులుగా నియమించి పోలీసు విధులు అప్పగించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ పోలీసు చట్టం, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఆ జీవో ఉందని విశాఖకు చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు పిటిషన్‌లో పేర్కొన్నారు.
పోలీసు శాఖలో జరిగే నియామకాలన్నీ పోలీసు నియామక బోర్డు ద్వారా జరగాలి. అందుకు భిన్నంగా ప్రభుత్వ నిర్ణయం ఉంది. పోలీసు విధులు నిర్వర్తించే హోం గార్డులను సైతం పోలీసులుగా పరిగణించడం లేదు. అలాంటిది సచివాలయాల్లో విధులు నిర్వహించే మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించి కానిస్టేబుళ్లకు ఉండే అధికారాలు కట్టబెట్టడం చట్ట విరుద్ధం.