తిరుపతిలో ఆర్టీసీ డ్రైవింగ్ యాప్ కలకలం, గేమ్ ఆడితే 20 శ్రీవారి లడ్డూలు, ఎలా?

గురువారం, 22 జులై 2021 (23:11 IST)
తిరుపతిలో ఆర్టీసీ డ్రైవింగ్ యాప్ కలకలంగా మారింది. సాధారణంగా చిన్నపిల్లల కోసం గేమ్స్ రెడీ చేసి అమ్ముతుంటారు. అయితే తిరుపతికి చెందిన ఒక వ్యక్తి ఏకంగా తిరుమలనే డబ్బుల సంపాదించడానికి వాడేసుకున్నాడు. అది కూడా శ్రీవారి మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించాడు. 
 
తిరుపతి ఎం.ఆర్.పల్లికి చెందిన సురేష్ కుమార్ అనే వ్యక్తి సంవత్సరం పాటు శ్రమించి ఒక యాప్‌ను తయారుచేశారు. ఆ యాప్ తిరుపతిలోని అలిపిరి నుంచి తిరుమలకు ఘాట్ రోడ్డులో వెళ్ళే ఆర్టీసీ బస్సును నడపడమే. అది ఒక గేమ్. ఈ గేమ్‌ను ప్లే స్టోర్ లోకి వెళ్ళి 179 రూపాయలు చెల్లించి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
 
అయితే ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సును ఏవిధంగా అయితే నడుపుతారో గేమ్‌లో కూడా అంతే ఆశక్తిగా నడపవచ్చు. కానీ ఈ గేమ్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా పడుతుంది.. అలాగే వర్చువల్ విధానం ద్వారా లడ్డూలను పొందవచ్చు. మళ్ళీ తిరుపతికి ఘాట్ రోడ్డు ద్వారా దిగొచ్చు. ఇలా యాప్‌ను డిజైన్ చేశారు. 
 
ఈ యాప్ పైన హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నారు. ముఖ్యంగా బిజెపి, జనసేనలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఇలాంటి యాప్‌లను తయారుచేయవచ్చా అంటూ హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో యాప్‌ను డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
 
ఈ యాప్ కాస్త హిందూ సంఘాల్లో ఆగ్రహావేశాలను గురిచేయడంతో టిటిడి విజిలెన్స్ మేల్కొంది. యాప్‌ను తయారుచేసిన వ్యక్తిని విచారించింది. అయితే యాప్‌ను డిలీట్ చేయాలని టిటిడి విజిలెన్స్ నుంచి ఒత్తిడి రావడంతో చివరకు సురేష్ కుమార్ అనే నిర్వాహకులు పారిపోయాడు. టిటిడి ఫిర్యాదుతో సురేష్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు