ముఖ్యంగా ఎస్ఐ మృతిపై కుటుంబ సభ్యులు తొలుత పలు సందేహాలు వ్యక్తం చేయడంతోపాటు అధికారుల వేధింపుల వల్లే చనిపోయాడంటూ ఆరోపణలు చేశారు. దాంతో, ఏడీజీ, ఐజీ నేతృత్వంలో సమగ్ర విచారణకు డీజీపీ విచారణకు ఆదేశించారు. పోలీస్ శాఖ ప్రతిష్టకు సంబంధించిన విషయం కావడంతో క్షుణ్ణంగా దర్యాప్తు చేసి విచారణాధికారులు డీజీపీకి నివేదిక సమర్పించారు.
ముఖ్యంగా 'ఆ మూడు రోజులు ఏం జరిగింది? ప్రభాకర్ రెడ్డి చివరిసారిగా ఎవరితో మాట్లాడాడు?' అనే విషయాలపై దృష్టి సారించారు. ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు కొద్ది నిమిషాల ముందు బ్యాచ్‌మేట్‌కు ఫోన్ చేసినట్లు కాల్‌డేటా ద్వారా విచారణాధికారులు గుర్తించారు. ఆ స్నేహితుడిని విచారించారు. తనకు భయంగా ఉందని, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడని సదరు ఎస్ఐ వెల్లడించినట్లు సమాచారం.
అలాగే, తన సర్వీస్ రివాల్వర్‌తో కణతలో కాల్చుకున్న సమయంలో ప్రభాకర్ రెడ్డి రివాల్వర్‌ను కొంత కిందకు వంచి ట్రిగ్గర్ నొక్కాడని, దాంతో, బుల్లెట్ తల వెనకవైపు నుంచి బయటకు వెళ్లింది. తల వెనుక నుంచి బుల్లెట్ రావడంతో పెద్దగా రంధ్రం ఏర్పడి అటునుంచే మాంసం బయటకు వచ్చిందని పోస్ట్‌మార్టం నివేదికలోనూ పేర్కొనడం జరిగింది.