తెలంగాణను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ...! 8 మంది మృతి..!

శుక్రవారం, 19 డిశెంబరు 2014 (10:10 IST)
ప్రాణాంతక స్వైన్‌ఫ్లూ వ్యాధి తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇటీవల కాలంలో 54 కేసులు నమోదయ్యాయి. వ్యాధిబారిన పడిన వారిలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. కాగా గత రెండు రోజుల్లోనే నాలుగు స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోవడం భయాందోళనను కలిగిస్తోంది.
 
మరో వైపు రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ కేసులు భారీగా నమోదు అవుతుండటంతో వైద్య ఆరోగ్య యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎన్ని కేసులు నమోదయ్యాయో చెప్పడానికి వైద్యాధికారులు వెనుకాడుతున్నారు. 
 
ముఖ్యంగా స్వైఫ్లూ గుండె, లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి త్వరగా వైరస్ సోకే ప్రమాదముందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు చనిపోయిన వారిలో ముగ్గురికి గుండె, షుగర్ వంటి వ్యాధులు ఉన్నాయని... వారికే స్వైన్‌ఫ్లూ సోకిందని వైద్యాధికారులు చెబుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తలనొప్పి, ఒంటినొప్పులు, జలుబు, దగ్గు, జ్వరం ఉంటే అనుమానించి సమీపంలో ఉన్న ఆసుపత్రులకు వెళ్లి చూపించుకోవాలని సూచించారు. చలికాలం కావడంతో వైరస్ సులువుగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని... రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి స్వైఫ్లూ వెంటనే సోకే ప్రమాదం ఉందని వైద్యులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి