అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకున్నట్లు కనబడుతోంది. తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్ ప్రజాయాత్ర చేపట్టేందుకు కొండగట్టును పాయింట్ గా చేసుకుని మొదలుపెట్టారు. ఇక ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఎంత బలం వుందన్న దానిపై అప్పుడే రకరకాల సర్వేలు కూడా బయటకు వస్తున్నాయి. ఓ జాతీయ మీడియా సంస్థ అయితే 2019 ఎన్నికల్లో వైసీపీకి 13 ఎంపీ స్థానాలు వస్తాయని, టీడీపి కూటమికి 12 ఎంపీ స్థానాలు ఖాయమని తేల్చింది.
ఐతే ఇదంతా వట్టి ట్రాష్ అంటున్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న స్థానాలని మించి కైవసం చేసుకుంటుందనీ, ఏకంగా 135 నుంచి 145 స్థానాలను రాబట్టుకుంటుందని వెల్లడించారు. తెదేపా విజయం సాధించబోయే స్థానాల్లో వైసీపి నుంచి అభ్యర్థులు కూడా పోటీ చేసే పరిస్థితి లేదని వెల్లడించారు. మహా వైసీపీ 30 నుంచి 35 స్థానాలను మాత్రమే గెలుచుకుంటుందేమోనని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తమ్మీద ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో తన బలం ఎంతో తెలుసుకునేందుకు 2019 ఎన్నికలు వేదిక అవుతాయని అంటున్నారు.