జాతీయ పార్టీగా తెలుగుదేశం... పార్టీ జాతీయ శాఖ అధ్యక్షుడుగా చంద్రబాబు...!

గురువారం, 28 మే 2015 (07:25 IST)
తెలుగుదేశం పార్టీ రూపు రేఖల్లో చాలా మార్పులు రానున్నాయి. ఆ పార్టీ సిద్ధాంతాల్లో కూడా గణనీయమైన సంస్కరణలే వస్తాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీని జాతీయ పార్టీగా తీర్చిదిద్దే ప్రయత్నాలు సాగుతున్నాయి. అందులో భాగంగానే పార్టీ జెండాతో పాటు అజెండా కూడా మారనున్నది.  ఈ మహానాడులోనే ఆ నిర్ణయం తీసుకోనున్నారు. చంద్రబాబు ప్రసంగం లేదా ఇతర నాయకుల మాటలను పరిశీలిస్తే అది ఖాయమని స్పష్టమవుతోంది. 
 
టీడీపీ రెండు రాష్ట్రాల్లోనూ స్థిరంగా ఉండడంతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. వీలైనన్ని ఎక్కువ సీట్లను సాధించుకోవడంద్వారా జాతీయ స్థాయిలో ప్రముఖ పాత్రను పోషించాలని చెప్పారు. ఎన్ని రాష్ట్రాల్లో వీలైతే అన్ని రాష్టాల్లో పార్టీని విస్తరించుకోవాలి. అందరూ సహకరించాలి. తెలంగాణలో హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఏ రాష్ట్ట్రానికి తగినట్లు ఆ రాష్ట్రంలో వ్యవహరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల నుంచి ఆరంభమవుతుంది. జూన్‌ 2న ఏపీలో నవ నిర్మాణ దీక్షను, తెలంగాణలో రాష్ట్ర అవతరణ ఉద్యమాలను నిర్వహించాలన్నారు. 
 
అదే సమయంలో కేంద్ర కమిటీ ఏర్పాటు దిశగా తెలుగుదేశం పార్టీ ముందడుగు వేసింది. పార్టీ నియమావళిలో తగు మార్పులు చేసింది. ఈ మేరకు కేంద్ర కమిటీ ఏర్పాటుపై పార్టీ రాజ్యాంగానికి చేసిన సవరణలను మహానాడులో ఆ పార్టీ నేత రవీంద్ర కార్యకర్తలకు వివరించారు. ఇప్పటి వరకూ పార్టీకి ఒకే రాష్ట్ర కమిటీ ఉండేదని, ఇప్పుడు రెండు రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటిపైన కేంద్ర కమిటీ ఉంటుందన్నారు. రాష్ట్ర పొలిట్‌బ్యూరోలతోపాటు కేంద్ర పొలిట్‌బ్యూరో కూడా ఉంటుందన్నారు. వచ్చే మహానాడును కేంద్ర కమిటీ ఏర్పాటు చేసేటట్లు సవరణ చేశామన్నారు. 
 
పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి సంబంధించి ప్రత్యేక నిబంధన పెట్టామన్నారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణకు మహానాడులో ప్రతినిధుల ఆమోదం తీసుకున్నారు. గతంలో రాజ్యాంగంలో అనేకచోట్ల రాషా్ట్రభివృద్ధికి అనే పదం ఉన్న కొన్నిచోట్ల దేశాభివృద్ధికి అని, మరికొన్ని చోట్ల రాషా్ట్రల అభివృద్ధికి అనే పదాలతో సవరణలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు, కేంద్ర కమిటీకి అధ్యక్షుడిగా లాంఛనంగా ఎన్నిక కాబోతున్నారు.

వెబ్దునియా పై చదవండి