తొలిసారిగా ఆ చిన్నారి బడికి వెళ్తున్న వేళ.. అతడిని మృత్యువు వెంటాడింది. పాఠశాల ముందే చిన్నారిని కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆ చిన్నారి తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని సైదాబాద్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. హఫీజ్ బాబా నగర్‌లో నివసించే మహబూబ్ అలీ, ముబీన్ బేగం దంపతులకు రహ్మాన్ అలీ అనే మూడున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు.
రహ్మాన్ అలీని సమీపంలోని నర్సరీలో చేర్పించారు. రంజాన్ పండుగ తర్వాత కుమారుడిని తొలిసారిగా ముబీన్ బేగం బడికి తీసుకు వెళ్లింది. ఇంటి నుంచి ఆటోలో బడివద్దకు వెళ్లి, పాఠశాలలోకి వెళుతుండగా, మాతృశ్రీ కాలనీ నుంచి వేగంగా వచ్చిన కారు రెహ్మాన్‌ను బలంగా ఢీకొంది.
ఈ ప్రమాదంలో ముందు చక్రాల కింద నలిగిపోయిన రెహ్మాన్, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ దూరం కావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.