తిరుపతి రైల్వేస్టేషన్‌లో పట్టాలు తప్పిన వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్

ఆదివారం, 22 జనవరి 2017 (12:07 IST)
తిరుపతి రైల్వేస్టేషన్‌లో వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఉదయం 2.30 నిమిషాలకు గ్యారేజ్ నుంచి రైలును స్టేషన్‌లోకి తీసుకువస్తుండగా పెద్ద శబ్దంతో రైలు పట్టాలు తప్పింది. దీంతో వెంటనే రైలును నిలిపేశారు ట్రైన్ డ్రైవర్. పట్టాలకు ఉన్న లింక్ వంగిపోవడంతో రైలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. రైలు పట్టాలు తప్పిన సమయంలో ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. 
 
వెంటనే రైల్వేఅధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రైలును మరమ్మత్తులు చేస్తున్నారు. వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ వారంలో గురువారం ఒక్కరోజు మాత్రమే తిరుపతి నుంచి బయలుదేరుతుంది. అయితే ప్రతి ఆదివారం వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌ను గ్యారేజ్ నుంచి బయటకు తీసి మరమ్మత్తులు చేస్తుంటారు. ఈరోజు అదేవిధంగా మరమ్మత్తులు చేయడానికి తీసుకువస్తుండగా రైలు పట్టాల మీద నుంచి పక్కకి ఒరిగింది.
 
ఈ విషయాన్ని రైల్వేఅధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై రైల్వే పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. తిరుపతి రైల్వేస్టేషన్‌లోనే ఈ ప్రమాదం జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి