మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు సీఎం జగన్‌తో బెడిసికొట్టింది.. ఇక రాం రామేనా?

మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (14:22 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో స్నేహసంబంధాలు బెడిసికొట్టినట్టున్నాయి. దీంతో ఆయన సోమవారం ముఖ్యమంత్రి నిర్వహించిన ఎమ్మెల్యేల వర్క్‌షాపుకు డుమ్మా కొట్టారు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, తాను పార్టీ మారబోతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్ వెంటే... లేకపోతే పొలం బాట అని చెప్పుకొచ్చారు. 
 
సోమవారం జరిగిన ఎమ్మెల్యే సమావేశానికి అనారోగ్యం కారణంగానే హాజరుకాలేక పోయినట్టు చెప్పారు. తనకు ఎప్పటికి నాయకుడు జగన్ రెడ్డే అని తేల్చి చెప్పారు. అవసరమైతే పొలం పనులు చేసుకుంటాను తప్ప బాస్‌ను ఎదురించోనని స్పష్టం చేశారు. తమ నాయకుడు జగన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటానని ఆయన వెల్లడించారు. 
 
కాగా, 'గడప గడపకు మన ప్రభుత్వం'పై తాడేపల్లి ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన జరిగిన వర్క్‌షాప్‌కు ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి డుమ్మా కొట్టడం విస్మయాన్ని కలిగించింది. క్యాంపు కార్యాలయం తన నియోజకవర్గ పరిధిలో.. కూతవేటు దూరంలోనే ఉన్నా కొంతకాలంగా ఆయన అటు వైపే వెళ్లడం లేదని... ఆ గడప తొక్కడానికి కూడా ఇష్టపడడం లేదని వార్తలు వినిపించాయి. జగన్‌తో అగాధం పెరగడమే దీనికి కారణమని వైసీపీ వర్గాలు అంటున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు