జగన్‌కు పెద్ద ఊరట... బెయిల్ రద్దు పిటీషన్‌ను కొట్టేసిన సీబీఐ కోర్టు

శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (13:59 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఊరట లభించింది. ఆయన బెయిల్ పిటీషన్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ చేసిన వినతిని ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. దీంతో జగన్‌ అరెస్టు గండం నుంచి బయటపడ్డారు. 
 
జగన్ మీడియా సాక్షి టీవీలో వచ్చిన మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ సాక్షులను ప్రభావితం చేసే విధంగా ఉందని, జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే. దీనిపై ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు.. తీర్పును శుక్రవారానికి వాయిదా వేసిన విషయం తెల్సిందే. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పును వెలువరించింది. జగన్ బెయిల్‌ను రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. జగన్ తరపు న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించింది. అంతేకాదు జగన్ విదేశీ పర్యటనకు కూడా కోర్టు అనుమతినిచ్చింది. 
 
మే 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ లోపు ఏవైనా 15 రోజులు విదేశీ పర్యటనకు వెళ్లి రావొచ్చని కోర్టు తెలిపింది. అయితే కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాలని షరతు విధించింది. కోర్టు తీర్పు పట్ల వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. న్యాయస్థానంలో తమ పార్టీ అధినేతకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశాయి.

వెబ్దునియా పై చదవండి