వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేసి మళ్లీ ముఖ్యమంత్రి కుర్చీలో జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెడితే మీ ఆస్తులు గాల్లో దీపాలుగా భావించాల్సిందేనని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కోనసీమ జిల్లా మండపేటలో వారాహి విజయభేరీ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా, మన ఆస్తి పత్రాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. వైకాపాకు ఓటు వేస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలే అవుతాయని వ్యాఖ్యానించారు. మన ఆస్తి పత్రాలపై జగన్ హక్కు ఏంటి అని, ఈ విషయంపై జగన్‌ను ప్రజలు నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.
భారత పాస్‌పోర్టుపై ప్రధాని మోడీ ఫోటో ఉండది, ఏపీలో మాత్రం పట్టాదారు పాస్ పుస్తకంలో మాత్రం జగన్ ఫోటో ఎందుకని ఆయన ప్రశ్నించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ రాజముద్ర ఉండాలని పవన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు జగన్ పాలన నుంచి విముక్తి కలిగించాలన్న బలమైన ఆకాంక్ష, సంకల్పంతోనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఏర్పాటు చేశామన్నారు. గత పదేళ్లుగా తనను అనేక ఇబ్బందులకు గురిచేశారని, ఎన్నో మాటలు అన్నారని తెలిపారు. ప్రజలు కోసం ఎన్ని మాటలైనా భరిస్తానని, ప్రజాసంక్షేమం కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.
ఓటు చీలకూడదు, ప్రజలే గెలవాలి, వైకాపా అవినీతి కోటను బద్ధలు కొట్టాలన్న బలమైన సంకల్పంతోనే తాను ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఈ ఎన్నిక తర్వాత జగన్‌కు, వైకాపాకు పొలిటికల్ హాలిడేను ప్రకటించాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, కోనసీమ జిల్లాలకు కొత్త నాయకత్వం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.